Crop Loss Due To Heavy Rains in Telangana :రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. వరదలతో పలు జిల్లాల్లో అన్నదాతలకి కంటిమీద కునుకులేకుండా పోయింది. దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురికావడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పొలాలు చెరువులను తలపిస్తుండగా నార్లు మొదలు సాగులోఉన్న పైరు వరకు దెబ్బతింటుండంటంతో ఆందోళన చెందుతున్నారు. ఇదే రీతిలో వర్షం కొనసాగితే మరింత నష్టపోతామని.. ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం.. వర్షాలతో గత 10 రోజుల్లో 4 లక్షల ఎకరాల్లో పత్తి పంట ముంపునకు గురైంది. 22 వేల ఎకరాల్లో కంది, 14 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10 వేల ఎకరాల్లో వేరుశనగ, 4 వేల ఎకరాల్లో పెసర, 12 వేల ఎకరాల్లోని కూరగాయల పంటలు ముంపునకు గురయ్యాయి. నాట్లు వేసిన 72 వేల ఎకరాల్లోకి.. నీరుచేరింది. వరదలకి అధికశాతం పైరు కొట్టుకుపోగా మిగిలిన చోట్ల ఇసుక మేటలు వేసింది.
Crop Loss in Telangana :పంట ప్రాథమిక దశలోనే ఇంత పెద్దఎత్తున వర్షాలువచ్చి మునిగిపోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. సాధారణంగా విత్తనాలు వేసిన తర్వాత అడపాదడపా వర్షాలతో మేలు జరుగుతుంది. అధికశాతం వర్షపాతం అప్పుడప్పుడు వచ్చినా నష్టంలేదు. కానీ ఈసారి ఆగకుండా.. రోజుల తరబడి భారీ వర్షం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పత్తి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ విత్తి నెలరోజులే అవుతోంది. మొలకల దశలోనే నీరు నిండిపోయి మొక్కల జీవక్రియ నిలిచిపోతోంది. నీటి నిల్వ వల్ల ఇప్పటికే ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, హనుమకొండ, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో పత్తిపంట మొలకలు ఎర్రబారినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు.