మొదటి నేరం ఛేదించగలిగితే... రెండోనేరం నివారించవచ్చు. పోలీసులు అనుసరించాల్సిన ఈ మౌలిక సూత్రం నానాటికీ పలచనమవుతోంది. 17 హత్యలు చేసిన ఎరుకల శ్రీను ఉదంతమే ఇందుకు నిదర్శనం. మొదటి హత్యను సమర్థంగా దర్యాప్తు చేసి నిందితుడ్ని పట్టుకోగలిగి ఉంటే... 16 మంది ప్రాణాలు నిలబడేవి. కారణాలు ఏవైనా కావొచ్చు కేసు దర్యాప్తులో పోలీసుల వైఫల్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. దర్యాప్తులో నాణ్యత లోపిస్తుండటం నేరగాళ్ల పాలిట వరమవుతోంది.
మహబూబ్నగర్ జిల్లాలో 17మందిని హత్య చేసిన ఎరుకల శ్రీను ఉదంతం ఇప్పుడు పోలీసుశాఖలోనూ... చర్చనీయాంశంగా మారింది. 2007 నుంచి మొదలైన ఈ హత్యల పరంపర ఈనెల 26న పట్టుబడే వరకూ కొనసాగింది. కాళ్లకు కడియాలు, మెడలో నగల కోసం మహిళలను మభ్య పెట్టి శివార్లలోకి తీసుకెళ్ళి హతమార్చేవాడు. ఈ మహిళలకు సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. కానీ పోలీసులకు యథావిధిగా మిస్సింగ్ కేసులపై ఉండే చిన్నచూపు కారణంగా సరిగా చర్యాప్తు జరగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హజీపూర్లోనూ నిర్లక్ష్యమే!
ఇదొక్కటే కాదు హజీపూర్లో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన శ్రీనివాసరెడ్డి ఉదంతం కూడా ఇలాంటిదే. 2015 ఏప్రిల్లో ఓ బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన శ్రీనివాసరెడ్డి గతేడాది మేలో పట్టుబడే వరకూ మొత్తం ముగ్గురి ప్రాణాలు తీశాడు. మొదటి బాలిక కనిపించకుండా పోయినప్పుడు ఫిర్యాదు చేసినా... పోలీసులు పట్టించుకోలేదని అప్పుడే శ్రద్ధ చూపి ఉంటే మిగతా రెండు హత్యలు జరిగేవి కాదని బాలిక తల్లిదండ్రులు వాపోయారు.
తగ్గుతున్న శిక్షలు... పెరుగుతున్న నేరాలు
ఒకప్పుడు రాష్ట్రంలో సగటు శిక్షలు 40 శాతానికి మించి ఉండేవి. కానీ ఇప్పుడిది 35.8 శాతమని జాతీయ నేరాలు నమోదు సంస్థ 2017 గణాంకాలు చెబుతున్నాయి. ఇది జాతీయ సగటు 48.8 శాతం కంటే తక్కువ. పోలీసులు నమోదు చేసిన అభియోగాలు న్యాయస్థానంలో వీగిపోయాయంటే అందుకు కారణం నేరం నిరూపించడానికి తగిన ఆధారాలు సేకరించలేకపోయారనే. ఆధారాలు సేకరించడం, వాటిని గుదిగుచ్చి న్యాయస్థానం ఆమోదించేలా ఆభియోగపత్రం సిద్ధం చేయడం నైపుణ్యంతో కూడిన పని కానీ ఇక్కడే లెక్క తప్పుతోంది.
ఒక్కో అధికారికి సగటున 50కి పైగా కేసులు
పోలీసులపై మితిమీరిన పనిభారం కూడా దర్యాప్తు నాణ్యతను దెబ్బతీస్తోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఏడాదికి 2 వేల కేసుల వరకూ నమోదవుతున్నాయి. ఇక్కడ ఒక్కో అధికారి సగటున సంవత్సరానికి 50కి పైగా కేసులు దర్యాప్తు చేయాల్సి వస్తోంది. ఈ స్థాయిలో కాపోయినా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. స్టేషన్ సిబ్బంది ఏకకాలంలో అనేక విధులు నిర్వర్తిస్తుండటం వల్ల ఏకాగ్రత చూపలేకపోతున్నారు. ఫలితంగా దర్యాప్తు ముందుకు సాగడంలేదు.