తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మరణాలు.. కడచూపూ కష్టమే! - CORONA UPDATES

కొవిడ్‌-19 మృతుల దహన సంస్కారాలకు కొన్ని శ్మశాన వాటికల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు నిర్వాహకులు అంత్యక్రియలు జరిపేందుకు వీలు లేదని వెనక్కి పంపుతున్నారు. వారిని ఒప్పించేందుకు బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరి తంతు ముగిసే వరకూ బంధువులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

CREMATION PROBLEMS FOR CORONA DEATHS IN HYDERABAD
కరోనా మరణాలు.. కడచూపూ కష్టమే!

By

Published : Apr 15, 2020, 2:27 PM IST

కరోనాతో వ్యక్తి మరణించినట్లు నిర్ధారించాక వైద్యులు బాధిత కుటుంబసభ్యులకు సమాచారం ఇస్తున్నారు. కేవలం ఐదుగురు మాత్రమే రావాలన్న ప్రభుత్వ నిబంధనను గుర్తుచేస్తున్నారు. చాలా సందర్భాల్లో అనుకున్న దానికన్నా తక్కువ మందే వస్తున్నారు. చివరి చూపు అనంతరం శ్మశానంలో ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబసభ్యులకు చెబుతున్నారు. ఈ లోపు జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యవేక్షణలో.. మృతదేహంపై వైరస్‌ నిరోధక ద్రావణం పిచికారీ చేసి, జిప్‌ బ్యాగ్‌లో ఉంచి సీల్‌ వేస్తారు.

శ్మశానంలో ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం రాగానే ఆసుపత్రి వెలుపల సిద్ధంగా ఉన్న ప్రత్యేక అంబులెన్సు ద్వారా మృతదేహాన్ని శ్మశానానికి తరలిస్తున్నారు. మృతుడి ముఖం కనిపించేలా ఉన్న సంచి ఉండడంతో.. గుంత చుట్టూ నాలుగు మీటర్ల దూరంతో గీసిన గీత వెలుపల నుంచి బంధువులకు.. కడసారి చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అనంతరం ప్రమాణాల ప్రకారం తవ్విన 8 అడుగుల గుంతలో మృతదేహాన్ని పూడ్చి, ఈ క్రమంలో రెండు సార్లు క్రిమి సంహారక మందు పిచికారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బంది దుస్తులను భస్మీకరణానికి పంపుతున్నారు.

తప్పని జాప్యం..

కొవిడ్‌ మృతులను ఖననం చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి అమలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. జీహెచ్‌ఎంసీ, పోలీసు, వైద్యశాఖ అధికారులు ఉన్నారు. మృతదేహం తరలింపులో మొదటి నుంచి జాప్యం జరుగుతోంది. అంబులెన్సులు ఆలస్యంగా వస్తున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శనివారం ప్రైవేటు ఆసుపత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చి, అంతలోనే మృతిచెందిన మహిళ మృతదేహాన్ని తరలించేందుకు ఐదు గంటలు పట్టిందని పోలీసులు చెబుతుండగా, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ విషయాన్ని ఖండిస్తున్నారు. వ్యక్తి చనిపోయిన సమయంతో తమకు సంబంధం లేదని, సంచిలో ప్యాకింగ్‌ చేసి, శ్మశానానికి తీసుకెళ్లమని చెప్పినప్పుడు తాము అంబులెన్సును పంపిస్తున్నామని చెబుతున్నారు.

ఈ మధ్యలో వైద్య సిబ్బంది మృతదేహాన్ని క్రిమి రహితం చేయడం, అదే సమయంలో మృతుడి బంధువులు శ్మశానంలో ఏర్పాట్లు చేసుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటున్నాయని ఏఎంవోహెచ్‌ రవిందర్‌గౌడ్‌ ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు తెలిపారు. ఆయా ఆచారాల ప్రకారం అంత్యక్రియల ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం పడుతుందన్నారు. కొన్ని శ్మశాన వాటికల నిర్వాహకులు అంత్య క్రియలకు ఒప్పుకోవడం లేదని, అలాంటి సందర్భాల్లో సమయం పడుతోందన్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details