Kunamneni Comments on 2000 Notes Cancellation : రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను చక్రబంధంలో బంధించే కుట్రలో భాగంగానే రూ.2000 నోట్లను కేంద్రం రద్దు చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. గతంలో యూపీ ఎన్నికల కంటే ముందు అప్పటి పాలక పార్టీ ఎస్‌పీ ప్రభుత్వాన్ని ఎన్నికలలో బలహీన పరిచే ఉద్దేశంతోనే రద్దు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. అదే తరహాలో ఇప్పుడు తాజా నిర్ణయం చేశారని ఆయన పేర్కొన్నారు. రూ.2000 నోట్ల రద్దు నిర్ణయం గతంలో మోదీ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలకు నిదర్శనమని పేర్కొన్నారు. నోట్ల రద్దు వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్నారు.
కర్ణాటకలో బీజేపీ ఘోర ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ నిర్ణయాన్ని ప్రకటించారని కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. ప్రతి అంశాన్ని ఏదో రకంగా ప్రచారం కోసం వాడుకునే మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. గతంలో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు నల్లధనం బయటికి వస్తుందని, ఉగ్రవాదం, అవినీతి అంతం అవుతుందని మోదీ బీరాలు పలికారని ఆయన గుర్తు చేశారు. ఆ లక్ష్యాలు నెరవేరకపోగా.. నాడు పెద్ద నోట్ల మార్పిడీ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని, కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు.