రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఊహకందని రీతిలో విజృంభిస్తోంది. గురువారం రికార్డుస్థాయిలో 1,213 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో పోరాడుతు ఎనిమిది మంది కన్నుమూశారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 18,570కి చేరింది. గురువారం వచ్చినవాటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 998 కేసులు వెలుగుచూశాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తున్న వైరస్ భూతం.... తీవ్ర కలకలం రేపుతోంది. మేడ్చల్‌లో 54, రంగారెడ్డిలో48 కేసులు రావడం మహమ్మారి విజృంభణకు అద్దంపడుతోంది.
జిల్లాల్లో పెరుగుతున్న కేసుల సంఖ్య
జిల్లాల్లో కరోనా కమ్మేస్తుంది. గురువారం ఖమ్మం 18, వరంగల్ గ్రామీణం 10, వరంగల్ అర్బన్ 9, నల్గొండ 8, భద్రాద్రి కొత్తగూడెం 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఏడు చొప్పున కేసులు నిర్ధరణ అయ్యాయి. కరీంనగర్, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఐదేసి మంది వైరస్ బారిన పడ్డారు. సూర్యాపేట, ములుగు, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో నాలుగు చొప్పున కొవిడ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 2 కేసులు రాగా... గద్వాల, సిద్దిపేట , మెదక్ , యాదాద్రి , నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లా ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు.