జీఎస్టీ వచ్చినా... డబ్బులు దండుకుంటున్నారు రాష్ట్ర ఖజానాకు అత్యధికంగా రాబడిని తెచ్చి పెట్టే శాఖ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. లొసుగులు లేకుండా ఏ వ్యాపారి వ్యాపారం చేయరన్నది జగమెరిగిన సత్యం. ఆ వ్యాపారులు అంతా వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోనే ఉన్నందున ఆ లొసుగులే అక్రమ ఆదాయ మార్గాలుగా ఎంచుకుంటున్నారు కొందరు అధికారులు. రెండు రోజుల కిందట సరూర్‌నగర్ ఏసీటీఓ ఓ వ్యాపారస్తుడి వద్ద నుంచి 50 వేల లంచం తీసుకుంటూ అనిశాకు దొరికిపోవడమే అందుకు నిదర్శనం.
మార్పులు చేసినప్పటికీ...
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12 వాణిజ్య పన్ను శాఖ డివిజన్లు, వందకు పైగా సర్కిళ్లు ఉన్నాయి. 2018-19 ఆర్థిక ఏడాదిలో 46 వేల కోట్ల రాబడి వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న ఈ శాఖలో అవినీతిని నిలువరించేందుకు శాఖాపరమైన మార్పులు చేసినప్పటికీ... లాభం లేకుండా పోయింది.
పదివి విరమణ పొందినా ఆగని వసూళ్లు...
జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్లు, రీఫండ్‌లు, రిటర్న్‌లు దాఖలు లాంటివి ఆన్‌లైన్‌లో ఉన్నందున... అధికారులకు వ్యాపారులతో సంబంధాలు కొంత వరకు తెగిపోయాయి. అయినా ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలకు వెళ్తుంటారు. ఇదే అదునుగా అక్కడ చోటు చేసుకున్న లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు... ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని భయపెడుతూ... డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని ఓ డివిజన్ పరిధిలో అయితే పదవి విరమణ పొందిన వారిని కూడా కార్యాలయంలో ఉంచుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. నగరంలోని ఏడు డివిజన్లల్లో మూడు డివిజన్లకు చెందిన కొందరు అధికారులు అడ్డదారులు తొక్కి కోట్లు సంపాదించినట్లు సమాచారం.
ఒక్క కేసు కూడా నమోదవడం లేదు
వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణంగా చెప్పుకునే బోధన్ నకిలీ చలానాల వ్యవహారంలో 250 కోట్లకుపైగా మొత్తం ప్రభుత్వ రాబడికి గండిపడినట్లు తేలింది. జీఎస్టీ వచ్చిన తరువాత సరిహద్దు తనిఖీ కేంద్రాలను పూర్తిగా ఎత్తివేయడం వల్ల వాహన తనిఖీల పేరుతో దండుకోడానికి అడ్డుకట్ట పడింది. తాజాగా 50వేల రూపాయలకు మించి సామాగ్రి రవాణా చేసే ప్రతి వాహనం వే బిల్లు కలిగి ఉండడం తప్పనిసరి. ఈ వే బిల్లు కూడా ఆన్ లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఫలితంగా పెద్దగా కేసులు నమోదు కావడం లేదు.
పర్యవేక్షణ కొరడవడడం వల్లే...
ఇక అధిక ఆదాయం వచ్చే హైదరాబాద్ నగర డివిజన్లకు బదిలీ చేయాలని చేసిన ప్రయత్నం విఫలమై ఓ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి ఏకంగా ఆ శాఖ కమిషనర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ... ఆకాశరామన్న లేఖ రాయడం సంచలనమైంది. ఆ ఉత్తరం శాఖలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌కు బదిలీ కోసం యత్నించి విఫలమైన ఓ అధికారి ఆ లేఖ రాసినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. గడచిన ఆరేళ్లకు చెందిన వ్యాపార లావాదేవీలను పరిశీలించే అధికారం ఉండటం వల్ల ఆడిట్ల పేరుతో ఓ అధికారి వ్యాపారులకు నోటీసులు ఇస్తారు. మరో అధికారి రంగంలోకి దిగి భారీ మొత్తంలో ఎగవేత ఉందని... ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, నోటీసులను ముగించేందుకు బేరసారాలు చేస్తారు. కేసు తీవ్రతను బట్టి భారీగా సొమ్ములు సంపాదించుకుంటారు. ఆ శాఖ కమిషనర్‌కు మరో ఐదు శాఖలకు ఇంఛార్జీ బాధ్యతలు ఉండటం వల్ల శాఖాపరమైన పర్యవేక్షణ పూర్తిగా కొరవడి... అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా పాలన కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చూడండి: ఇస్రో ఛైర్మన్ కన్నీటిపర్యంతం- మోదీ ఓదార్పు