తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో కరోనా కలవరం - భాగ్యనగరంపై కరోనా పంజా

హైదరాబాద్ నగరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నగరంలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా పులువురు కొవిడ్ మహమ్మారి కాటుకు గురవుతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులు, నర్సులు, పాత్రికేయులతోపాటు.. పలు ప్రభుత్వ అధికారులకు సైతం కరోనా సోకుతూ.. ఆయా కార్యాలయాలు మూసివేతకు దారితీస్తున్నాయి. బుధవారం జీహెచ్​ఎంసీలో ఓ అధికారికి కరోనా సోకగా.. గురువారం దక్షిణ మధ్య రైల్వేకు చెందిన హైదరాబాద్ భవన్​లో మరో అధికారికి కరోనా నిర్ధరణ కావడం వల్ల నాలుగురోజుల పాటు కార్యాలయాన్ని మూసివేశారు.

Hyderabad corona cases  latest news
Hyderabad corona cases latest news

By

Published : Jun 11, 2020, 8:48 PM IST

భాగ్యనగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజు దాదాపుగా రాష్ట్రంలో రెండు వందల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఓ ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోన్న మల్లాపూర్ డివిజన్​కు చెందిన 25 ఏళ్ల యువతికి గురువారం కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. హైదరాబాద్ భవన్​లో ఓ అధికారికి కరోనా సోకగా.. నాలుగు రోజుల పాటు హైదరాబాద్ భవన్ మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

వెంగళరావు నగర్ డివిజన్​లోని జవహర్ నగర్​లో 65 ఏళ్ల వ్యక్తికి, అల్విన్ కాలనీ డివిజన్ సాయినగర్ కాలనీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకగా.. వారిద్దరినీ అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు.

కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్​...

కుత్బుల్లాపూర్ పరిధిలో ఆరుగురికి కరోనా సోకింది. శ్రీనివాస్ నగర్, గాజులరామారం, సాయిబాబానగర్, దులపల్లి, రాజీవ్ గాంధీనగర్, పేట్ బషీరాబాద్​​లలో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కుకట్ పల్లి వివేకానంద నగర్ డివిజన్ సుమిత్ర నగర్​లో 22 ఏళ్ల యువకునికి, బోయిన్​పల్లి ఆర్​ఆర్​ నగర్​లో 40 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకగా వారిని గాంధీకి తరలించి... కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. నిజాంపేట్​కు చెందిన 34 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్​కు కరోనా సోకింది.

మూడో రోజు గాంధీలో జూడాల నిరసన...

జియాగూడ ఇందిరానగర్​లో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెంది ఐదు రోజులు గడుస్తున్నా.. వారి కుటుంబ సభ్యులను అధికారులు హోం క్వారంటైన్ చేయకపోవటం వల్ల వారు బయటే తిరుగుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గాంధీలో జూనియర్ వైద్యులు మూడో రోజు నిరసన కొనసాగించారు. కొవిడ్ రోగులకు గాంధీతో పాటు ఇతర ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని జూడాలు సర్కారుకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వైద్యులపై దాడిని నిరసిస్తూ.. తమకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details