ఒకప్పుడు కరోనా అంటే ఉన్న భయం ఇప్పుడు ఎవరికీ లేదు. పండగొచ్చినా... పబ్బమొచ్చినా... నిబంధనలు అంటూ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే... గో కరోనా అంటూ ప్రజలూ సహకరించారు. కానీ సెకండ్ వేవ్‌లో మాత్రం ఇవేమి కనిపించట్లేదు. రంజాన్ పవిత్రమాసం, శ్రీరామ నవమి సందర్భంగా నగరంలో జరుగుతున్న శోభయాత్రలు పోలీసులను కలవరపెడుతున్నాయి. మాస్కులు తప్పనిసరి చేస్తూ జీవో జారీచేసినట్టే ఊరేగింపులు.. శోభాయాత్రలు.. సామూహిక ప్రార్థలనపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని భావిస్తున్నారు.
పర్వదినాల వేళ.. విజృంభిస్తే ఎలా..?
ఓవైపు కరోనా వైరస్.. మరోవైపు రంజాన్ పవిత్రమాసం ప్రారంభం, శ్రీరామ నవమి సందర్భంగా నగరంలో జరుగనున్న శోభాయాత్ర పోలీసులను కలవరపెడుతున్నాయి. గతేడాది లాక్‌డౌన్‌లో భాగంగా మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేయకూడదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈసారి మసీదుల్లో ఉపవాస ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లిం సోదరులు వస్తే వారికి ఎలా నచ్చజెప్పాలన్న అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.
పక్క రాష్ట్రాల్లో మాదిరిగా నగరంలో కూడా కరోనా విజృంభిస్తే పరిస్థితి ఎలాగని పోలీసులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సామూహిక ప్రార్థనలు, శోభాయాత్రలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో మసీదులు, ఆలయాల వద్ద గుంపులుగా ఉండొద్దని పోలీసులు సలహాలిస్తున్నారు. ప్రార్థనల కోసం వచ్చే వారికి మసీదుల వద్ద మాస్కు ధరించాలంటూ సూచిస్తున్నారు. సామూహిక ప్రార్థనలను పరిగణనలోకి తీసుకుని మంగళవారం కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించామని, నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు నిర్వహించాలంటూ చెప్పామని దక్షిణమండలంలోని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఈ నెల14 నుంచి 144 సెక్షన్