తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీఎస్​ఆర్టీసీ యాత్ర బస్సులపై కరోనా ప్రభావం - ఏపీలో కరోనా వివరాలు

కార్తిక మాసంలో ఎక్కువ మంది శైవక్షేత్రాలను సందర్శిస్తుంటారు. వీరి సౌకర్యార్థం ఏటా పుణ్యక్షేత్రాలకు వివిధ ప్యాకేజీల్లో ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ఈసారి కూడా జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక యాత్రా బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కరోనా ప్రభావంతో భక్తుల నుంచి స్పందన కరవైంది. దీంతో ప్రత్యేక సర్వీసులను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

apsrtc
ఏపీఎస్​ఆర్టీసీ యాత్రా బస్సులపై కరోనా ప్రభావం

By

Published : Nov 25, 2020, 4:15 PM IST

కార్తికమాసం వచ్చిందంటే.. భక్తులు అధిక సంఖ్యలో శైవక్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే ఏపీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్​లోని ​పంచారామ క్షేత్రాలతో పాటు శబరిమల, ఎరుమేలి, విజయవాడ, తిరుపతి, శ్రీశైలం, మహానంది, సిరిపురం, అరుణాచలం, కాణిపాకం, పళణి తదితర క్షేత్రాలను సందర్శించేలా భక్తులకు వివిధ ప్యాకేజీలతో ప్రత్యేక బస్సులు తిప్పేందుకు తూర్పుగోదావరి జిల్లా ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు అన్ని డిపోల నుంచి యాత్రా బస్సులను సిద్ధం చేశారు. కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలను దర్శించుకునేలా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు.

భక్తులు లేకపోవడంతో తొలివారం జిల్లాలో అన్ని డిపోల్లో ప్రత్యేక సర్వీసులను రద్దు చేశారు. రెండో వారం(22న) కేవలం రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలేశ్వరం నుంచి ఒక్కో బస్సు చొప్పున మాత్రమే నడపగా వాటిలో సగం సీట్లు ఖాళీగానే మిగిలాయి. కార్తికంలో ఆదివారం రోజుల్లో పుణ్యక్షేత్రాలు సందర్శించే వివిధ వర్గాల కోసం ఈ నెల 14, 21, 28, వచ్చే నెల 5, 12వ తేదీల్లో ప్రత్యేక బస్సులు నడిపేలా ఏర్పాటు చేసినప్పటికీ తొలి రెండు వారాలు భక్తులు లేక సర్వీసులను ఆపేశారు.

గతేడాది ఆదాయం భళా..:

గతేడాది కార్తికమాసంలో జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి పంచారామ క్షేత్రాలకు 139 ప్రత్యేక బస్సులు నడిపారు. 100 శాతం అక్యుపెన్సీ రేషియోతో 94,210 కిలోమీటర్ల మేర సర్వీసులు తిరిగాయి. దీనిద్వారా ఆర్టీసీకి రూ.39,88,879 అదనపు ఆదాయం సమకూరింది. శబరిమల, ఇతర పుణ్యక్షేత్రాలకు భక్తులు 34 బస్సులను బుక్‌ చేసుకోగా మరో రూ.56,06,747 అదనపు రాబడి వచ్చింది. ఈసారి ఆదాయం లేనట్లే.

ABOUT THE AUTHOR

...view details