బంజారాహిల్స్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన మెహిదీపట్నంకు చెందిన యువకుడికి(30) కరోనా నిర్ధారణ కావడం వల్ల గురువారం గాంధీకి తరలించారు. ఈ యువకుడి కుటుంబంలోని ఏడు మంది సభ్యులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కాగా చైతన్యపురి డివిజన్ సత్యనారాయణపురంలో 62 ఏళ్ల వృద్ధురాలికి కరోనా బయట పడటంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఛత్రినాక ఠాణాపరిధి లక్ష్మీనగర్‌లోని ఓ కుటుంబంలో నలుగురికి ఇటీవల కరోనా సోకడంతో అధికారులు ఈ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆ పరిధిలోని 64 మందిని చార్మినార్ యునాని ఆసుపత్రిలో క్వారంటైన్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించగా వారందరికీ కరోనా లేదని తేలింది. నల్లకుంటలోని ఫీవరాసుపత్రిలో 5 మంది కరోనా అనుమానితులు చేరారు. వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
తల్లిదండ్రులతోపాటు 9 నెలల చిన్నారికి..
మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలో గురువారం మరో ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్థానిక మున్సిపల్ కమిషనర్ బి.సుమన్‌రావు తెలిపారు. ఇక్కడి సిర్లాహిల్స్‌కాలనీకి చెందిన దంపతులకు మంగళవారం కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాన్ని అధికారులు కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. తాజాగా ఆ దంపతులకు చెందిన ఇద్దరు కుమారుల (22), (24)తో పాటు జిల్లెలగూడలోని వారి కూతురు (27), అల్లుడు (30), మనవడి(9 నెలలు)కి కరోనా ఉన్నట్లు తేలింది. బాధితులను గురువారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 6 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెకండరీ కాంటాక్ట్‌లు ఉన్న 18 మందిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచినట్లు ప్రకటించారు. బంజారాహిల్స్‌లో ఓ వృద్ధురాలి(62)కి కరోనా సోకింది. సదరు మహిళ భర్త సహా ఆ ఇంటి పరిసర ప్రాంతాల వారు, స్థానిక వైద్యుడు, బంధువులు.. మొత్తం 9 మంది నుంచి శాంపిళ్లు సేకరించి వైద్య పరీక్షలకు పంపించారు. జల్‌పల్లి షాహిన్‌నగర్‌కు చెందిన వ్యక్తి(58)కి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. దీంతో అధికారులు షాహిన్‌నగర్‌ను కంటెయిన్‌మెంట్ జోన్‌గా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఆరు కేసులు నమోదు అయ్యాయి.
ఇవీ చూడండి:ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.