గ్రేటర్ హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ఎక్కువగా ఎనిమిది సర్కిళ్ల నుంచి వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఐదు సర్కిళ్లతో పాటు, కూకట్ పల్లి , శేరిలింగపల్లి, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ఒక్కో సర్కిల్‌ను హైరిస్క్ ప్రాంతాలుగా ప్రకటించారు. అయితే ఈ ఎనిమిది సర్కిళ్లలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ... అక్కడ ప్రత్యేకాధికారులను ఏర్పాటు చేసింది. కేసులు ఎక్కువగా నమోదైన సర్కిళ్లలో అడిషనల్ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ బాధ్యతలు అప్పగించారు.
సర్కిళ్లవారీగా అడిషనల్ కమిషనర్లకు బాధ్యతలు
శేరిలింగంపల్లి జోన్‌లోని యూసుఫ్‌గూడకు అడిషనల్ కమిషనర్ యాదగిరికి, సికింద్రాబాద్ జోన్‌లోని అంబర్‌పేట్‌కు అడిషనల్ కమిషనర్ కెన్నెడీ, ఖైరతాబాద్ జోన్‌లోని మెహదీపట్నంకు అడిషనల్ కమిషనర్ శంకరయ్య, కార్వాన్కు జేసీ సంధ్య, చార్మినార్ జోన్‌లోని చాంద్రాయణగుట్టకు అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మికి, చార్మినార్ జోన్ లోని చార్మినార్‌కు అడిషనల్ కమిషనర్ రాహుల్ రాజ్‌కి, చార్మినార్ జోన్‌లోని రాజేంద్ర నగర్‌కు అడిషనల్ కమిషనర్ సంతోష్‌కు, కూకట్పల్లి జోన్‌లోని కుత్బుల్లాపూర్‌కు ఇన్ఛార్జిగా ప్రియాంక అలకు బాధ్యతలు ఇచ్చారు. వీరు ప్రతిరోజు అక్కడి ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి అమలు చేయాలి. కానీ ఇంతవరకు బాగానే ఉన్నా అక్కడి కట్టడి చర్యలు సమగ్రంగా జరగడం లేదన్న విమర్శలొస్తున్నాయి.