Corona Cases in Telangana : తెలంగాణలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా కేసుల పట్ల, అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Raja Narasimha) తెలిపారు. కొవిడ్ నిర్మూలన కోసం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా వివిధ ఆసుపత్రిలో వెంటిలేటర్ల పనితీరును పరిశీలించాలని వైద్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా బాధితులకు అవసరమయ్యే ఆక్సిజన్ కన్సన్ట్రేటర్లను తక్షణమే ఉపయోగంలోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
Health Minister Damodar Raja Narasimha Review on Covid Cases : ప్రస్తుతం వాడుకలో లేని వెంటిలేటర్లను పునరుద్ధరించాలని దామోదర రాజనర్సింహ చెప్పారు. దీంతో పాటు కరోనా వార్డులలో అవసరమైన యంత్రాలను, డ్రగ్స్, డయాగ్నోస్టిక్ పరికరాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేసేందుకు ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలో 34 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు, ప్రైవేట్ పరిధిలో 84 ఉన్నట్టు అధికారులు, మంత్రికి వివరించారు.
న్యుమోనియా బాధితుల్లో కొవిడ్! - నిలోఫర్ ఆసుపత్రిలో 14 నెలల బాలుడిలో వైరస్ నిర్ధరణ
రాష్ట్రంలో రోజూ 16,500 మందికి పరీక్షలు జరిపేలా వసతులు :రోజూ 16,500 మందికి పరీక్షలు నిర్వహించేలా వసతులు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత రెండు వారాలుగా 6344 శాంపుల్స్ సేకరించినట్లు పేర్కొన్నారు. గత వారంలో ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబులలో కలిపి మొత్తంగా 40 ఆర్టీపీసీఆర్ నమూనాలు (RTPCR Tests in Telangana) తీసుకున్నామని, వాటి ఫలితాలు ఇంకా వెల్లడికావాల్సి ఉందని వారు వివరించారు. డిసెంబర్ ముగిసే నాటికి రోజుకు 4,000 మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకోవాలని దామోదర రాజనర్సింహ అన్నారు. రోజూ సాయంత్రం 4 గంటల లోపు డైలీ హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని ఆయన ఆదేశించారు.