ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల నమోదు ఆగడం లేదు. ఇప్పటివరకు 122 పాజిటివ్ బాధితులతో రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా గుంటూరు కొనసాగుతోంది. బాధితుల్లో ఇద్దర్ని డిశ్చార్జ్ చేశారు. 88 కేసులు గుంటూరు అర్బన్ ప్రాంతంలోనే నిర్ధారణ కావడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దిల్లీ మూలాలను దాదాపుగా అధికారులు చేధించారు. గుంటూరు గ్రామీణ పరిధిలో కొత్త కేసులు నమోదు అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. నరసరావుపేట, దాచేపల్లిలో కంటైన్మెంట్ ప్రాంతాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. అక్కడి ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మారుస్తున్నట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు జిల్లాలో 113 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. బాధితుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో మృతి చెందిన ఓ ప్రైవేటు వైద్యుడి వద్ద వైద్యం పొందిన రోగులు, ఆసుపత్రికి వెళ్లివచ్చిన వారి బంధువులు, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. కర్నూలు నగరం సహా పొరుగునే ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి రోగులు ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి వైద్యం పొందినట్లు అధికారులు గుర్తించారు. కేఎం ఆసుపత్రికి వచ్చిన వారంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని.... ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ సహాయ నిధి కోసం జిల్లా పొదుపు మహిళలు రూ.40 లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు.
కృష్ణా జిల్లాలో కేసులు 48కి పెరిగాయి . గురువారం విజయవాడకు చెందిన మరో ముగ్గురికి కరోనా సోకగా... వీరిలో ఒక మహిళా వార్డు వాలంటీర్ కూడా ఉన్నారు. పాజిటివ్ వచ్చిన రెడ్ జోన్ల పరిధిలో విస్తృతంగా నిర్ధరణ పరీక్షల కోసం శ్వాబ్ సేకరణ చేపడుతున్నారు . జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఏడుగురికి మాత్రం ఎవరి నుంచి వైరస్ సోకిందనేది తెలియడం లేదు . జిల్లాలో ఇప్పటివరకూ నలుగురు ఆసుపత్రి నుంచి ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు . నలుగురు మృతి చెందారు.