తెలంగాణ

telangana

ETV Bharat / state

నయాపైసా లేదు కరెంట్ బిల్లు ఎలా కట్టాలి సారూ..! - కరెంటు బిల్లుల వార్తలు

లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలలుగా చాలామంది విద్యుత్తు బిల్లులు చెల్లించలేదు. ఉపాధి లేకపోవడం, జీతాలు సరిగా అందకపోవడం తదితర కారణాల నేపథ్యంలో విద్యుత్తు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. ఈ నెలలో మాత్రం బిల్లులు తప్పకుండా కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. నెలాఖరులోగా చెల్లించకపోతే కనెక్షన్లు తొలగించేందుకూ వెనుకాడమని హెచ్చరిస్తున్నారు.

Consumers who cannot afford electricity bills in telangana
జీతాల్లేవు.. చెల్లింపు ఎలాగంటున్న వినియోగదారులు..

By

Published : May 22, 2020, 9:42 AM IST

లాక్‌డౌన్‌ తొలి రెండు విడతల్లో ఆంక్షలు తీవ్రంగా ఉండడంతో ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించే అవకాశం ఇచ్చారు. అవగాహన లేని కొందరు చెల్లించలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు కట్టలేదు. గ్రేటర్‌లో డిస్కంకు రావాల్సిన ఆదాయం సగానికి పడిపోయింది. గత నెల పరిశ్రమలు సైతం బంద్‌ కావడంతో హెచ్‌టీ వినియోగమూ అంతంతమాత్రంగానే ఉంది. హెచ్‌టీ వినియోగదారుల నుంచి లాక్‌డౌన్‌లోనూ బిల్లులు వసూలు చేయగా ఈనెల ఎల్‌టీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నారు.

క్షేత్రస్థాయికి సిబ్బంది
లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో డిస్కం అన్ని సేవలను పునరుద్ధరించింది. కరెంట్‌ బిల్లు వసూలు కేంద్రాలను తెరిచింది. వినియోగదారులు ఎడం పాటించేలా ఏర్పాట్లు చేసింది. శివారు ప్రాంతాల్లో స్పాట్‌ కలెక్షన్స్‌ తీసుకుంటోంది. బిల్లు చెల్లింపు గడువు ఈనెల 21వ తేదీతో ముగియడంతో బకాయిదారుల జాబితాను సిద్ధం చేసింది. ఎల్‌టీ(గృహ, చిన్న తరహా వాణిజ్య వినియోగదారుల)కి సంబంధించిన బకాయి రూ.900 కోట్లుగా ఉంది. బకాయిదారుల్లో గత రెండు నెలల బిల్లులు చెల్లించని వారే ఎక్కువ మంది ఉన్నట్లు గుర్తించింది. సిబ్బందిని వినియోగదారుల వద్దకు పంపేందుకు సన్నద్ధమవుతోంది. ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్న వారే లక్ష్యంగా చేసుకొంది. ఈ మేరకు సిబ్బందికి ఇప్పటికే మౌఖిక ఆదేశాలు అందాయి.

చెల్లిస్తేనే నడపగలం

‘వినియోగదారులు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తేనే డిస్కం నడుస్తుంది. రెండు నెలలుగా వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. ఆంక్షల సడలింపుతో బయట కార్యకలాపాలు మొదలయ్యాయి. తాము సైతం తమ విధులను నిర్వర్తించాల్సిందే. బిల్లులు కట్టకపోతే సిబ్బందిని పంపి కనెక్షన్‌ తొలగిస్తాం. కట్టకపోయినా కనెక్షన్లు తొలగించొద్దు అని ప్రభుత్వం నుంచి తమకెలాంటి ఆదేశాలు లేవు’ అని పేరు చెప్పని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో అన్నారు.

ఎలా కట్టగలం: ఆదాయం లేక, సగం జీతాలతో ఎలాగో నెట్టుకొస్తుంటే కరెంట్‌ బిల్లులు బకాయిలతో సహా కట్టమంటే ఎలా అని సామాన్య, మధ్య తరగతి వర్గాలు ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్‌లో బిల్లు కట్టలేదని ఇబ్రహీంపట్నంలోని ఒక కళాశాల విద్యుత్తు కనెక్షన్‌ తొలగించడంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందిపడ్డారు.

ఇదీ చూడండి:ముగ్గురు లష్కరే తోయిబా తీవ్రవాదులు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details