ప్రాజెక్టులపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై రాష్ట్ర భాజపా కూడా ఇటీవల విమర్శలకు పదును పెట్టింది. ఇద్దరి ఎజెండా ఒకటే కావడం వల్ల సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. వీలైనంత త్వరలో అమిత్ షాను కలవనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు.
లక్ష కోట్లకు
కాళేశ్వరం 28వేల కోట్లతో పూర్తి కావాల్సి ఉండగా... రివర్స్ పంపింగ్ పేరుతో నాలుగు చోట్ల నీటిని ఎత్తి పోస్తూ... ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచారని సీఎల్పీ నేత భట్టి ఆరోపించారు. రూ.1500 కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టును రూ.15 వేల కోట్లకు అంచనాలను పెంచేశారన్నారు.
కేంద్రంపై ఒత్తిడి
ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా ఆరోపణలు గుప్పిస్తోంది. కాంగ్రెస్, భాజపా రాష్ట్ర నాయకత్వాలు చేస్తున్న ఆరోపణల సారాంశం ఒకటే కావడం వల్ల సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించేందుకు కేంద్రహోంశాఖ చొరవ చూపుతుందని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అవినీతిపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇవాళో, రేపో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కేంద్రహోం మంత్రి అపాయింట్మెంట్ తీసుకోనుంది. కేసీఆర్‌తో భాజపాకు అవగాహన లేకుంటే... కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించాలని అమిత్ షాను డిమాండ్ చేయనుంది. ఇందుకు రాష్ట్ర భాజపా నేతలు తమతో కలిసి రావాలని హస్తం పార్టీ కోరుతోంది.
ఇవీ చూడండి : కామాంధుడు... మనవరాలినీ వదల్లేదు