తెలంగాణ

telangana

ETV Bharat / state

లోక్​సభ బరిలో కాంగ్రెస్​ సీనియర్లు

లోక్​సభ ఎన్నికల బరిలోకి సీనియర్లను దింపడానికి కాంగ్రెస్​ అధిష్ఠానం నేతలతో చర్చిస్తోంది. పార్టీ కీలక నేతలు పోటీ చేసేందుకు ముందుకు రాకున్నా వారిని ఒప్పించే ప్రయత్నంలో ఉంది. ఈనెల 13 లేదా 15వ తేదీలోపు లోక్​సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పీసీసీ నేతలు స్పష్టం చేశారు.

By

Published : Mar 12, 2019, 7:56 AM IST

Updated : Mar 13, 2019, 12:23 AM IST

ఎన్నికల బరిలో నిలిపేందుకు సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్న కాంగ్రెస్​ అధిష్ఠానం

లోక్​సభ బరిలో కాంగ్రెస్​ సీనియర్లు
లోక్‌సభ ఎన్నికల బరిలో కీలక స్థానాల్లో సీనియర్‌ నేతలను బరిలో దింపడానికి కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఈ నెల 15 లోపు లోక్‌సభ బరిలో దింపే అభ్యర్థులను ఖరారు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్‌ నేతలతో అధిష్ఠానం తాజాగా చర్చిస్తోంది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు, పీసీసీ ఎన్నికల కమిటీ రూపొందించిన అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం పరిశీలిస్తోంది.

నేడు దిల్లీకి పీసీసీ ముఖ్య నేతలు

దిల్లీ నేతలు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా వచ్చిన సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అవకాశాలను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోకూడదనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉంది. అభ్యర్థుల జాబితాపై బుధవారం ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ తుది కసరత్తు చేయనుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్కతో పాటు పీసీసీ ముఖ్యనేతలు ఈ రోజు రాత్రికి దిల్లీకి చేరుకోనున్నారు. ఈ నెల 13 లేదా 15 తేదీలోపు 17 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పీసీసీ ముఖ్యనేతలు స్పష్టం చేశారు.ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో అభ్యర్థులను ముందే ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది.

లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పరిశీలన


చేవెళ్ల: సిట్టింగ్​ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని బరిలోకి దింపనున్నారు.
హైదరాబాద్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రముఖ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నారు. అజార్‌ను పోటీచేయాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. అజారుద్దీన్​ పోటీ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అవసరమైతే బరిలోకి దింపడానికి నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్‌ను సిద్ధంగా ఉండాలని పార్టీనేతలు పేర్కొన్నట్లు తెలిసింది.
సికింద్రాబాద్‌: మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ అభ్యర్థిగా బరిలో ఉండడం ఖాయం.
నల్గొండ: ఈ స్థానం నుంచి పలువురు పోటీలో ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డిని పోటీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఈ స్థానం కోసం మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి, సూర్యాపేట కాంగ్రెస్‌ నేత పటేల్‌ రమేశ్‌ రెడ్డి రేసులో ఉన్నారు.

కరీంనగర్‌: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేరు ఖరారవుతుందనే నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్‌ రెడ్డిని పోటీపై కాంగ్రెస్‌ నేతలు దృష్టిసారించారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న జీవన్‌ రెడ్డి ఈ నెల 23న ఆ ఎన్నిక ఫలితాల అనంతరమే నిర్ణయం తీసుకుంటామని చెప్పనట్లు తెలిసింది.
ఖమ్మం: టికెట్‌ రేసులో పలువురు ఉన్నా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదిరి టికెట్‌ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, రవి కూడా టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. కొత్త వ్యక్తిని ఇక్కడ బరిలో దింపడంపై కూడా కాంగ్రెస్‌ పరిశీలిస్తోంది.
వరంగల్‌: మందకృష్ణ మాదిగను బరిలో దింపాలని దృష్టి సారించారు.
నిజామాబాద్‌: మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డిల్లో ఒకరిని బరిలో దింపనున్నారు. మాజీ ఎంపీ మధుయాస్కీ భువనగిరి నుంచి పోటీకి ఆసక్తి చూపుతుండటంతో నిజామాబాద్‌ నుంచి షబ్బీర్‌ అలీ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది.
జహీరాబాద్‌: పార్టీ నేత మదన్‌మోహన్‌రావు పేరు దాదాపు ఖాయమైనట్లేనని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు.
నాగర్‌కర్నూలు: సిట్టింగ్‌ ఎంపీ నంది ఎల్లయ్య తనకే ఈసారి కూడా అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతన్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పేరుకూడా పరిశీలనలో ఉంది.
ఆదిలాబాద్‌ : పోటీకి మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ నుంచి ఆదివాసీలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
మహబూబాబాద్‌: బలరాం నాయక్‌, బెల్లయ్య నాయక్‌, రాములు నాయక్‌తో పాటు చీమల వెంకటేశ్వర్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
మెదక్‌: అసెంబ్లీ టికెట్‌ ఆశించిన గాలి అనిల్‌ కుమార్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణీ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
పెద్దపల్లి: జి.శ్రీనివాస్‌ లేదా కవ్వంపల్లి సత్యనారాయణలో ఒకరికి అవకాశం దక్కనుంది.మల్కాజ్‌గిరి స్థానం అభ్యర్థిత్వానికి సంబంధించిన పేర్లు పరిగణనలో ఉన్నా బలమైన అభ్యర్థికోసం ప్రయత్నిస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

మహబూబ్‌నగర్‌: కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, మాజీమంత్రి డి.కె.అరుణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పోటీకి ఆసక్తి చూపకపోయినా డి.కె.అరుణను పోటీపై పునరాలోచించాలని పార్టీ సూచించినట్లు తెలిసింది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, ప్రతాప రెడ్డి అభ్యర్థిత్వాలు పరిశీలనలో ఉన్నాయి.

ఇవీ చూడండి: నేడే శాసనమండలి ఎన్నికలు

Last Updated : Mar 13, 2019, 12:23 AM IST

ABOUT THE AUTHOR

...view details