Telangana Assembly Elections 2023 : కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ తెచ్చాయి. అప్పటి వరకు అంతర్గత విభేధాలతో సతమతమైన హస్తం నేతలు.. కర్ణాటక రిజల్ట్స్ తర్వాత అంతా ఏకతాటిపైకి వచ్చారు. సీనియర్ నేతలంతా మూకుమ్మడిగా ముందుకు కదులుతూ.. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లోని అసంతృప్త నేతలు సైతం ప్రస్తుతం హస్తం బాట పడుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లిలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. రేపు ఖమ్మంలో జరగబోయే జన గర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు పొంగులేటి, జూపల్లి అనుచరులు సైతం పెద్దఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
Congress Khammam Public Meeting : కర్ణాటక ఎన్నికల ముందు వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనుకున్న అసంతృప్త నేతలంతా.. ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. భారత్ రాష్ట్ర సమితి బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లి సైతం భారతీయ జనతా పార్టీలో చేరతారని అంతా ఊహించినా.. అందుకు భిన్నంగా ఆ ఇద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీలో చేరికలు తగ్గిపోగా.. ఉన్నవారిని కాపాడుకోవడమే ఆ పార్టీకి కత్తిమీద సాములా తయారైంది. ఈ నేపథ్యంలోనే టీ-కాంగ్రెస్ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో అధికారం పక్కా తమదే అంటూ హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఠాక్రే .. సీఎం కేసీఆర్‌ది ఉత్తిత్తి ఆర్భాటం తప్ప.. ఏమీ లేదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే తమ పార్టీలో నేతల మధ్య మంచి సమన్వయం ఉందని.. ఎవరి పని వారు చేస్తూ ముందుకు సాగుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.