'ఆ వ్యాఖ్యలు ఠాక్రే పట్టించుకోలేదు.. వేరే విషయాలు చర్చించాం' komatireddy Venkat Reddy Meets ManikRao thakare : తెలంగాణలో హంగ్ వస్తుందంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇటు రాజకీయవర్గాలోనూ, అటూ పార్టీలోనూ తీవ్ర చర్చకు దారి తీశాయి. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే కూడా స్పందించారు. ఇందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి సమావేశం ముగిసింది.
భేటీ అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే దానిపై చర్చించామని వివరించారు. ముందస్తుగా టికెట్లు ఇవ్వాలని కోరానని చెప్పారు. ఆలస్యంగా ప్రకటించడం వల్ల గతంలో గొడవలు జరిగాయని చెప్పానని తెలిపారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని చెప్పానని వెల్లడించారు.
నిన్నటి తన వ్యాఖ్యలపై చర్చ జరగలేదని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. నిన్నటి వ్యాఖ్యలను ఠాక్రే పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు.ఇంకొంచెం కష్టపడితే 60 సీట్లు వస్తాయని చెప్పానని పేర్కొన్నారు. పార్టీని గెలిపించే విషయంపై గంటన్నరసేపు చర్చించామని అన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కోరానని వివరించారు. ఈ నెలాఖరులో భువనగిరి నుంచి తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో బైక్ యాత్ర నిర్వహిస్తామని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిదంటే: నిన్న రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో అందరం కష్టపడితే 40-50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"మాణిక్‌రావు ఠాక్రేతో అనేక విషయాలపై చర్చించాం. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏం చేయాలనే దానిపై చర్చించాం. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలి. గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని కోరా. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్పాను. ఇంకొంచెం కష్టపడితే 60 సీట్లు వస్తాయని తెలిపాను. పార్టీని గెలిపించే విషయంపై గంటన్నరసేపు చర్చించాం." - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ