Congress Meeting On MP Elections : త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షులు హోదాలో ఇవాళ, రేపు రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల నాయకులతో సమీక్ష ఏర్పాటు చేశారు. ఇవాళ ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలల్లో కనీసం 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకునేట్లు కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీం సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌కు ఇన్ఛార్జిగా (Adilabad Incharge) మంత్రి సీతక్క, నిజామాబాద్ జూపల్లి కృష్ణారావు, మెదక్ కొండా సురేఖ, మహబూబ్‌నగర్ దామోదర రాజనర్సింహ, హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు.
CM Revanth Reddy Meeting on Parliament Elections : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సమీక్షా సమావేశంలో వీరు కూడా పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాల వారీగా వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఆయా నియోజకవర్గాల తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ పార్టీల బలాబలాలను నాయకులతో అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చించారు.
ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి తొలి సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఇంద్రవెల్లి సభలో సీఎం పాల్గొన్నారు. ఈసారి పర్యటనలో ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని కూడా ప్రకటించారు.
జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని కూడా సీఎం తెలిపారు.