చమురు ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేసేందుకే తామంతా గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వెళ్లినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు రవాణా వ్యవస్థను భరించలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఆ విషయం ప్రభుత్వానికి తెలియజేయడం కోసం గుర్రపు బండ్లపై వెళ్లినట్లు చెప్పారు. కానీ తమను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ గాంధీ భవన్ నుంచి గుర్రపు బండ్లల్లో అసెంబ్లీకి వెళ్లారు. అనుమతించకపోవడంతో అక్కడ బైఠాయించి ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్టు చేసి విడుదల చేసిన తర్వాత గాంధీ భవ్లో మీడియాతో మాట్లాడిన వారు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.
ప్రభుత్వం అప్రజస్వామిక చర్యలకు పాల్పడుతోంది. ప్రభుత్వ ఆగడాలను, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. సభకు ఎలా వెళ్లాలి అనేది సభ్యుల ఇష్టం. అరెస్టులపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు సమాధానం చెప్పాలి. రవాణా వ్యవస్థను భరించలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందనే.. ప్రభుత్వానికి చెప్పడం కోసమే గుర్రపు బండ్లపై వెళ్లాం. మద్దతివ్వాల్సింది పోయి అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం. -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
నూతన సాగు చట్టాలతో రైతులకు రక్షణ ఉండదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. కనీస మద్దతు ధర నిర్ణయించే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. దీంతో రైతులతో పాటు వినియోగదారులకు నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.