తెలంగాణ

telangana

By

Published : Oct 20, 2019, 11:33 PM IST

Updated : Oct 21, 2019, 5:46 AM IST

ETV Bharat / state

ముట్టడికి హస్తం నాయకులు... కట్టడికి పోలీసుల వ్యూహాలు!

ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్​ పిలుపునివ్వగా... హస్తం నేతల కదలికలపై పోలీసు శాఖ దృష్టి సారించింది. పోలీసుల ఎత్తులను చిత్తుచేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రగతి భవన్​ను ముట్టడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్​ నేతలుంటే... ఒక్క కార్యకర్తను కూడా ముట్టడించకుండా చూడాలని పోలీసు బాసులు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు.

CONGRESS LEADERS PLAN TO PRAGATHI BHAVAN OBSESSION POLICE PLAN TO PROTECT

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్‌ నాయకులు ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో పోలీస్​శాఖ అప్రమత్తమైంది. కాంగ్రెస్‌ నేతలతోపాటు ముట్టడిలో పాల్గొనబోయే నాయకులకు చెందిన సమాచారం సేకరించింది. పోలీసులు గృహనిర్బంధంలో ఉంచే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్‌ నాయకులు... ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఇంట్లో కాంగ్రెస్‌ నాయకులు సమావేశమై ప్రగతిభవన్‌ ముట్టడికి సంబంధించిన వ్యూహరచన చేశారు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, రేవంత్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఎవరి జాగ్రత్తలో వాళ్లు...!

పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధంలో ఉంచే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్‌ నేతలు... ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసినా... ప్రగతిభవన్‌ను ముట్టడించి తీరాలని నిర్ణయించుకున్నారు. ఎవరెక్కడ ఉన్నారన్న విషయం తెలియనీకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫోన్‌ నంబర్లను ట్రాక్‌ చేసే అవకాశం ఉండటం వల్ల... సొంత ఫోన్‌ కూడా వాడడంలేదని తెలుస్తోంది. పోలీసులు మాత్రం నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తూ... అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రగతి భవన్‌ దగ్గరకు రాకుండా పోలీసులను మోహరించారు. మఫ్టీలో కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టడి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే డీసీపీలను ఆదేశించారు.

ఇవీచూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై

Last Updated : Oct 21, 2019, 5:46 AM IST

ABOUT THE AUTHOR

...view details