Congress leaders angry on KTR comments : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సొంత పార్టీ నేతలు కొందరు వ్యతిరేకించినా.. ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా సోనియాగాంధీ కుటుంబంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువసంఘర్షణ సభ కోసం హైదరాబాద్కు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని టూరిస్ట్‌తో పోల్చడం.. నగరంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూడాలంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
నియామాకాల్లో విఫలం.. నీళ్లు, నిధులు, నియామాకాలు లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు.. ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో ఎంతో మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ లేరని.. ఆప్పట్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన చెన్నారెడ్డి, మదన్ మోహన్లాంటి నేతల పేర్లు కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని.. కేటీఆర్ తన తాహతుకు మించి మాట్లాడుతున్నారని హెచ్చరించారు.
రాష్ట్ర ఏర్పాటుకు సుముఖం.. కేసీఆర్ ఒక్కరే ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదని అన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యమకారుల ఆత్మ బలిదానాల వల్ల స్వరాష్ట్రం వచ్చిందని పేర్కొన్నారు. అప్పట్లోనే ప్రధాని నెహ్రు, ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్కావడానికి పార్లమెంట్లో కాంగ్రెస్ నేతలందరి సారథ్యం ఉందని గుర్తుచేశారు.