Telangana Politics Latest News : ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో బీ టీమ్ పదం కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండటంతో పార్టీలు వ్యూహాత్మకంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందనే అంచనాలతో తమ ప్రత్యర్థి పక్షాలు రెండూ ఒక్కటేననే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి.. బీఆర్ఎస్ బీ టీమ్ అనే అంశాన్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. దీనిపై రాష్ట్ర నేతలు గులాబీ పార్టీపై విమర్శలు చేస్తుండగానే.. ఖమ్మం జనగర్జన సభలోనూ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదే పదాన్ని పలుమార్లు ప్రస్తావించారు. మరో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ అంటే బీజేపీ రిశ్తేదార్ సమితి అంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల కేసుల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉదాసీనంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
Rahul Gandhi B Team Comments On BRS : కాంగ్రెస్ విమర్శలతో ఎన్నికల వేళ ఎలాంటి నష్టం జరగకూడదనే లక్ష్యంతో.. బీఆర్ఎస్ కూడా దీటుగానే స్పందిస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం జనంలోకి వెళ్లకుండా ఉండేలా వ్యూహాలు అమలు చేస్తోంది. మహారాష్ట్ర పర్యటనలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే అంశంపైన ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్‌ను తమను బీజేపీకు బీ టీమ్ చేస్తే.. బీజేపీ.. కాంగ్రెస్‌కు ఏ టీమ్ చేసిందని.. తాము ఎవరికి బీ టీమ్ కాదని ప్రజల టీమ్ అని స్పష్టం చేశారు.
Rahul Gandhi Speech at Khammam :అటు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పైనా బీఆర్ఎస్ నేతలు గట్టిగానే బదులిచ్చారు. బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్ కాదని.. మిమ్మల్ని ఢీకొట్టే టీమ్ అంటూ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఎదురుదాడి చేశారు. తమది బీజేపీ బంధువుల పార్టీ కాదని.. మీదే భారత రాబందుల పార్టీ అని విమర్శించారు. ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అంటూ మండిపడ్డారు. పార్లమెంటులోనూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడింది బీఆర్ఎస్నేనని మంత్రులు, ఎంపీలు స్పష్టం చేశారు.