గాంధీభవన్‌లో భేటీకానున్న 'రాజకీయ వ్యవహారాల కమిటీ' Congress PAC Meeting in Hyderabad Today : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. పాదయాత్ర కాలం ముగించుకున్న కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీలపై కొన్ని రోజులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు పార్టీ చేరికలపై కన్ను వేశారు. రాష్ట్రంలో ఎన్నికల జోరు మొదలైప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు పార్టీ చేరికలపై దృష్టి పెట్టారు. కర్ణాటకలో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్ పెరిగింది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి చేరికలతో పార్టీ బలోపేతంగా మారింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్ను గద్దే దించడానికి కాంగ్రెస్ నాయకులు ప్లాన్ చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌లో సమావేశం కానుంది. ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటు పీఏసీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్నికలు దగ్గరలో ఉండటంతో రాబోయే వంద రోజుల్లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై పీఏసీ చర్చించనుంది. ప్రధానంగా ప్రచార వ్యూహాలు, పార్టీలో చేరికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఇటీవల సమావేశమైన ముఖ్య నాయకులు పలు అంశాలపై చర్చించారు. అయితే ఆయా అంశాలన్నీ కూడా పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో భేటీ సమాలోచనలకే పరిమితం అయ్యాయి.
కాంగ్రెస్ ఇతర డిక్లరేషన్లపై క్లారిటీ: గాంధీభవన్‌లో ఇవాళ జరగనున్న పీఏసీ సమావేశంలో బస్సు యాత్ర, ప్రచార అస్త్రాలు, రాష్ట్రవ్యాప్తంగా సభల నిర్వహణ, ఇప్పటికే ప్రకటించిన వ్యవసాయ, యువ డిక్లరేషన్లతో పాటు చేయూత పథకాన్ని ఇంటింటికీ తీసుకెళ్లేందుకు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. అదేవిధంగా బీసీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఇతర డిక్లరేషన్లకు సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 17వ తేదీన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో సర్వేలతో పాటు రాజకీయ, సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో తెరపైకి వచ్చిన అంశాన్ని కూడా ఇక్కడ చర్చిస్తారని తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన ఎప్పట్లోగా ఉండాలి, చేరికలకు సంబంధించి ఎలాంటి విధానాలను అనుసరించాలి, బయట నుంచి వచ్చే నాయకులకు పార్టీపరంగా ఎలాంటి భరోసా ఇవ్వాలి తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బీసీ గర్జన సభ: మరోవైపు బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలన్న అంశం తెరపైకి రావడంతో, కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ గర్జన సభను నిర్వహించాలని ముందుకు వెళుతుంది. ఇప్పటికే పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంత్ రావు జిల్లాలను తిరుగుతూ బీసీ గర్జనకు భారీ ఎత్తున జనాన్ని తరలిరావాలని ఆయా జిల్లాల నాయకులకు సూచిస్తున్నారు. బీసీ గర్జన సభను విజయవంతం చేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: