Congress Foremen Committee in Telangana : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ నాయకత్వం.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వస్తున్న తరుణంలో జాబితా విడుదల అనంతరం, పార్టీ నేతల నుంచి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ఎవరైనా కాంగ్రెస్ నాయకులు అసంతృప్తికి లోనైతే వారిని బుజ్జగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం మాజీ మంత్రి జానారెడ్డి అధ్వర్యంలో ఫోర్‌మెన్ కమిటీని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది.
Congress Foremen Committee Leader : ట్రబుల్ షూటర్‌గా సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. జానాతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్‌లతో కమిటీ ఏర్పాటు చేశారు. టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత ఈ కమిటీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ గాంధీభవన్‌లో జానారెడ్డి అధ్యక్షతన కమిటీ భేటీ అయింది. అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై కమిటీ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో ప్రచారానికి ఏర్పాట్లపై కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని అగ్రనాయకులతో బస్సు యాత్రను రాష్ట్రవ్యాప్తంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మేనిఫెస్టోను ఈ బస్సు యాత్రలో విడుదల చేసేలా చర్యలు చేపడుతుంది.
Congress PAC Meeting in Telangana : గాంధీభవన్‌లో పీఏసీ సమావేశం.. ప్రచార ప్రణాళికపై ప్రత్యేక దృష్టి
Congress Election Plans in Telangana : అధికార పార్టీని గద్దె దించేలా.. తన పార్టీలోని గెలుపు గుర్రాల ఎంపికపై సుమారు నెల రోజుల నుంచి స్క్రీనింగ్ కమిటీలు పలుమార్లు నిర్వహించి.. 119 నియోజక వర్గాల్లో అభ్యర్థులను నిర్ణయించే దిశగా అడుగులు వేస్తోంది. అధికార పార్టీ అన్ని నియోజక వర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు సాగుతోంది. సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 17 రోజుల్లో జిల్లాలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొనే ఏర్పాట్లకు సన్నద్ధం అయింది.