కరోనా బారిన పడి మహానగరంలోని ఆసుపత్రుల్లో దాదాపు పది వేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే సరాసరిన రోజూ 50 మంది చనిపోతున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య వందల్లోనే ఉంటోంది. ఇందులో కొవిడ్ మరణాలతోపాటు కరోనాయేతర మృతులు ఉంటున్నారన్నది వైద్యాధికారుల వాదన. మరణాల విషయంలో ఎవరి లెక్కలు వారికున్నా మృతదేహాలను బంధువులకు అప్పగించే విషయంలోనే తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గాంధీలో ఇదీ ప్రక్రియ
కరోనాతో చనిపోయిన వ్యక్తి బంధువులకు మృతదేహాన్ని చూపిస్తారు. వివరాలను నమోదు చేస్తారు. ఆ తరువాత పోస్టుమార్టం చేస్తారు. రాజధాని పరిధిలో కానీ, ఇతర జిల్లాలవి కానీ మృతదేహాలను సంబంధీకులకు ఇవ్వాలంటే మృతుడు నివసిస్తున్న ప్రాంతం ఏ పోలీసుస్టేషన్ పరిధిలో ఉందో ఆ ఠాణా నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) తీసుకొచ్చి చూపాలి. లేకపోతే ఇవ్వడం లేదు. ఎన్‌ఓవోసీ తీసుకోవడం పెద్ద ప్రహసనంగా మారింది. మొత్తం ప్రక్రియకు కనీసం 12 గంటల సమయం పడుతోంది.
కష్టకాలంలోనూ.. కాలయాపనే!
కొవిడ్‌తో చికిత్స పొందుతున్న ఓ యువకుడు రెండు రోజుల కిందట గాంధీలో సాయంత్రం 5 గంటల సమయంలో మరణించాడు. సాయంత్రం అయింది ఈ రోజు మృతదేహాన్ని ఇవ్వలేం మర్నాడు రమ్మని బంధువులకు చెప్పారు. మర్నాడు ఉదయం 8 గంటలకే వెళితే శవపంచనామా చేసి మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి ఉదయం 11 గంటలైంది. ఈ లోపు మరో అధికారి వచ్చి కరీంనగర్ పోలీసుస్టేషన్ నుంచి ఎన్‌వోసీ తీసుకొస్తేనే ఇస్తామని స్పష్టం చేశారు. వారికి పోలీసు అధికారులతో ఉన్న పరిచయంతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఆ పత్రాన్ని చరవాణిలో తెప్పించుకొని అందజేస్తే అప్పుడు అప్పగించారు. అదే సాధారణ వ్యక్తులైతే కరీంనగర్ వెళ్లి ఎన్వోసీ తీసుకురావడానికి కనీసం ఒక రోజు పట్టేది. పోలీసులందరూ కరోనా కట్టడి చర్యల్లో క్షేత్రస్థాయిలో ఉండడం వల్ల ఎన్వోసీల జారీకి ఆలస్యమవుతోంది. నగరంలోని ఠాణాల్లోనూ ఇలాగే కాలయాపన అవుతోంది.
ఇలా చేస్తే మేలు
గాంధీతోపాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోలీసు అవుట్‌పోస్టులున్నాయి. ఆసుపత్రి సిబ్బంది అవుట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇస్తే సంబంధిత జిల్లా పోలీసులను వారే సంప్రదించి అక్కడి నుంచి అందే సమాచారం ఆధారంగా అవుట్‌పోస్టులోనే ఎన్వోసీ జారీ చేస్తే ఈ జాప్యాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వారుండే పరిధిలోని ఠాణాలకు సమాచారం ఇస్తే, అక్కడి పోలీసులు సంబంధిత జిల్లా పోలీసులను సంప్రదించి, ఎన్వోసీ ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.