2022 కల్లా... రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే ప్రభుత్వ లక్ష్యం. రెండేళ్ల క్రితం... ప్రధాని చెప్పిన మాట. దేశానికి ఆయువుపట్టుగా ఉన్న వ్యవసాయాన్ని ఫలసాయంగా మార్చటమే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు కట్టుబడి ఉన్నామని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తోంది. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతోంది. అదే కోవలో ఇప్పుడు ఒక సవరణతో సహా రెండు బిల్లులను తీసుకొచ్చింది. ఈ 3 బిల్లులు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని.. సంస్కరణలకు ఇవి కీలకమని చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయితే, ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగ వ్యతిరేకిస్తున్నాయి. మిత్రపక్షాలు నిరసన గళమెత్తుకున్నాయి. రైతు సంఘాలు ఆందోళన బాట పట్టాయి.
గతంలోనే ఆర్డినెన్స్‌లు..
ఈ మూడు బిల్లులలోని నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆర్డినెన్స్‌లుగా జారీ చేసింది. వెంటనే వాటికి అనేక వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుత వర్షాకాల సమావేశాలలో ఈ ఆర్డినెన్సులను సభామోదం కోసం బిల్లులుగా ప్రవేశపెట్టారు. ఒక పక్క, బిల్లులపై తర్జనభర్జనలు, నిరసనలు సాగుతుండగానే...నిత్యావసర సరుకుల సవరణ బిల్లు 2020ను లోక్‌సభ ఆమోదించింది. మిగతా రెండు బిల్లులపై చర్చ సందర్భంగానే.. ఓటింగ్ సమయంలో బిల్లును నిరసిస్తూ.. విపక్ష కాంగ్రెస్, డీఎంకే, ఆర్ఎస్పీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అకాలీదళ్ తమ మంత్రి నిష్క్రమణను ప్రకటించింది.
మిత్రుల నుంచే వ్యతిరేకత..
ఇలా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావించిన వ్యవసాయ బిల్లులకు ఎన్డీఏ మిత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ మూడు బిల్లులను రైతు వ్యతిరేక బిల్లుగా అభివర్ణిస్తూ శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హరియాణాలో భాజపా ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జననాయక్ జనతా పార్టీ ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేజేపీ చీఫ్ దుశ్యంత్ సింగ్ చౌతాలా ప్రస్తుతం హరియాణా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన తొలిగిపోతే.. హరియాణాలో ఎన్డీఏ సర్కార్ కుప్పకూలే ప్రమాదముంది. రైతులు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వం తెలుసుకుని అందుకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైన అంశం మార్కెటింగ్ వ్యవస్థ ప్రాధాన్యత తగ్గించటం. మార్కెటింగ్ ప్రమేయం లేకుండా రైతులు... కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు విక్రయించే వీలు కలుగుతుంది. అయితే, దశాబ్దాలుగా సంప్రదాయ మార్కెట్లు అమ్మకందారుకీ, కొనుగోలుదారుకీ మధ్య ఒక వేదికగా పనిచేస్తున్నాయి. రైతులకు అన్యాయం జరగకుండా నిరోధిస్తాయి. ఆ మార్కెట్లలో వ్యవహరించే ఏజెంట్లకు, కొనుగోలు దారులకు, అమ్మకందారులకు కూడా లైసెన్సింగ్ ఉంటుంది. ఈ బహిరంగ వ్యాపారంలో అటువంటి రక్షణలు, పద్ధతులు ఏమీ ఉండవు. కనీస మద్దతు ధర అమలుచేయాలనే నిబంధన ఏమీ ఉండదు. మార్కెట్ డిమాండ్ ప్రకారమే ధరలు ఉంటాయి. అందువల్ల బ్లాక్ మార్కెట్ దందా మొదలవుతుందంటున్నారు పరిశీలకులు.
ఉత్పాతాలు వస్తే తప్ప..
ఇక నిత్యావసర సరుకుల సవరణ బిల్లులో భాగంగా, ఉత్పాతాలు వస్తే తప్ప నిత్యావసరాల పంపిణీలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోదు. సాధారణ సమయాల్లో, ఎంత నిల్వ చేసుకున్నా, కృత్రిమంగా ధరలు పెంచుకున్నా పట్టించుకోదు. ఆహారభద్రతకు ఈ బిల్లు పెద్ద ప్రమాదమని విమర్శకులు అంటున్నారు. రైతును కాంట్రాక్టు వ్యవసాయంలోకి దించేవరకే, అధిక ప్రతిఫలాన్ని సంస్థలు ఇస్తాయని...ఒకసారి వ్యవసాయ రంగమంతా కాంట్రాక్టుమయం కాగానే, వ్యాపారులే శాసిస్తారని రైతాంగం భయపడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్పత్తులు రాష్ట్ర ప్రభుత్వం కొనకుండా.. కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నారు.
మూడు కొత్త బిల్లులు..