రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువకు పడిపోతున్నందున చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణశాఖ ప్రజలను హెచ్చరించింది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పడిపోయి చలి అధికంగా ఉంటోంది. శనివారం తెల్లవారుజామున అత్యల్పంగా సిర్పూరు(కుమురం భీం జిల్లా)లో 9.7, మర్పల్లి(వికారాబాద్)లో 10, హైదరాబాద్ శివారు తుర్కయాంజాల్‌లో 11.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ అధికంగా ఉంటోంది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. రానున్న రెండురోజుల్లో రాత్రిపూట చలి మరింత తీవ్రమవుతుందని అంచనా.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రత 10 డిగ్రీలలోపు నమోదయ్యే సూచనలున్నాయి. ఉష్ణోగ్రత 10 డిగ్రీలకన్నా తక్కువ నమోదైతే ఆ ప్రాంతాల్లో శీతలగాలులు వీస్తున్నట్లు వాతావరణశాఖ ప్రకటిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శీతలగాలులు వీస్తున్నాయి. ఇవి క్రమంగా రాష్ట్రమంతా విస్తరించే సూచనలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర అధికారి శ్రావణి తెలిపారు.