COCK FIGHTS : ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వేళ రాష్ట్రంలో పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో కోడిపందేలు, పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి.. మూడు రోజుల్లో కోళ్ల మీదే రూ.150 కోట్లకు పైగా పందేలు సాగాయని అంచనా. జూదంపై ఇంతకు రెట్టింపు పందేలు కాసినట్లు సమాచారం.
Kodi Pandelu in AP : కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం, అంపాపురం, పెనమలూరు, ఈడుపుగల్లు, గుడివాడలో కోడి పందేలు వేసేందుకు వీఐపీలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు, నందిగామ, జగయ్యపేట, పెనుగంచిప్రోలులో జోరుగా పందేలు సాగాయి. కొందరు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు. పెనుగంచిప్రోలు బరి వద్ద కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.. పందేలు కాస్తూ హడావుడి చేశారు.
AP Kodi Pandelu : కోడి పందేల బరుల పక్కనే కోతముక్క, కోసు, మూడు ముక్కలాట, చిన్నబజారు, పెద్దబజారు, గుండాట, చిత్తాట, నెంబర్లాటతో పాటు... ఎక్కడికక్కడ గుడారాల్లో కాసినోలు కూడా ఏర్పాటుచేశారు. ఈ ఏడాది కోడి పందేలను మించిన జూదం జరిగింది. ఈడుపుగల్లు వద్ద ఇలాంటి ఆటలకు సంబంధించిన 50కి పైగా టేబుళ్లు దర్శనమిచ్చాయి. తిరువూరులో ఒక్కో టేబుల్ మీద 5 నుంచి 10లక్షల ఆట సాగింది. ఈడుపుగల్లు, అంపాపురంలోనే 10 కోట్ల జూదం జరిగిందని అంచనా.
బరుల వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌లు పూర్తిగా వాహనాలతో నిండిపోయాయి. అంపాపురం, ఈడుపుగల్లులో బరుల వద్ద పార్కింగ్ ఆదాయమే 30 లక్షలు వచ్చిందని అంచనా. బరుల వద్ద మద్యం ఏరులై పారింది. అక్కడే కౌంటర్లను తెరిచి మరీ విచ్చలవిడిగా విక్రయాలు చేశారు. ఒకవైపు ఆడుతూ, మరోవైపు తాగుతూ... మందుబాబులు, పేకాట రాయుళ్లు హల్‌చల్ చేశారు. ఇంత జరుగుతున్నా ఎక్కడా కనీసం ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.