రేపు ప్రగతిభవన్‌లో తెరాస నేతలతో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై తెరాస నాయకులతో కేసీఆర్ చర్చించనున్నారు.
మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శనీయం:ప్రజాస్వామిక పంథా ద్వారా, దేశ ప్రజలను స్వాతంత్ర్యోద్యమంలో లక్ష్యసాధన దిశగా కార్యోన్ముఖుల్ని చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జీవితం అందరికీ, అన్ని కాలాలకూ ఆదర్శనీయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్ గాంధీజీ జాతికి అందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.
స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అహింసా, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి.. విజయం సాధించి చూపడం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారని కేసీఆర్ అన్నారు. గాంధీ ఆచరించిన బాటలో పయనించిన ఎన్నో దేశాలు బానిసత్వం నుండి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు.