KCR Visited Srirangam Ranganathaswamy: తమిళనాడులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి... రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు జిల్లా కలెక్టర్ శివరాసు, ఆలయాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రికి.. పుజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులు ఆలయ ప్రధాన ఏనుగుకు పండ్లు అందజేసి... గజరాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా తమిళనాడు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవాళ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా కేసీఆర్... తమిళనాడుకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ విమానంలో తిరుచ్చి చేరుకున్న అనంతరం... విమానాశ్రయం నుంచి ఓ ప్రైవేట్ హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడి నుంచి శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఇవాళ రాత్రి చెన్నైలో బస చేసి మంగళవారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసే అవకాశముంది. కేంద్ర వైఖరి, రాజకీయ అంశాలపై స్టాలిన్‌తో చర్చించనున్నారు.