ప్రశాంతత పరిఢవిల్లేలా... ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. టెంపుల్‌టౌన్, కాటేజీ నిర్మాణాలు... యాదాద్రి పరిసర ప్రాంతాల సుందరీకరణ, భక్తులకు వసతి సౌకర్యాల కల్పనపై సీఎం సమీక్షించారు. క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణం సహా ఆలయ తుదిమెరుగులకు అయోధ్య, అక్షరధామ్ వంటి పుణ్యక్షేత్రాలకు మెరుగులు దిద్దిన అనుభజ్జులైన శిల్పులతో పనిచేయించాలని అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీకి 7 ఎకరాలు...
ప్రస్తుతమున్న ఆర్టీసీ బస్టాండ్, డిపో స్థలాన్ని ఆలయ నిర్మాణ అవసరాలకు వినియోగిస్తున్నందున... ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి గుట్ట సమీపంలో 7 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కి ఫోన్ చేసి మాట్లాడిన సీఎం... బస్టాండ్ నిర్మాణ పనులను ఆలయ నిర్మాణ నియమాలను అనుసరించి ఆధ్యాత్మిక ఉట్టిపడేలా నిర్మించాలని సూచించారు.
3 వేలకు పైగా కార్లు పట్టేలా...
రహదారులు, భవనాల శాఖతో సమన్వయం చేసుకొని పని ప్రారంభించాలని ఆదేశించారు. 11 ఎకరాల స్థలంలో 3 వేలకు పైగా కార్లు పట్టేలా పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. పూర్తిగా శాకాహారం అందించే ఫుడ్ కోర్టులు నిర్మించాలని దక్షిణాది, ఉత్తరాది వంటకాలతో పాటు అంతర్జాతీయ భక్తుల కోసం వంటకాలను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
మరింత ప్రాధాన్యత...
హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి మరింత ప్రాధాన్యత వస్తుందని దేశ విదేశాలనుంచి వచ్చే పర్యాటకులు, భక్తులు నారసింహుడిని దర్శించే అవకాశాలుంటాయని సీఎం తెలిపారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపిన యాదాద్రి... నిర్మాణాలు పూర్తిచేసుకునే సమయానికి మరింతగా ప్రాచుర్యం పొందుతాయని చెప్పారు.
భక్తలోకానికి ఆలయ ప్రాశస్త్యం...
యాదాద్రి ప్రాశస్త్యాన్ని భక్తలోకానికి తెలిపేలా ప్రభుత్వం సమాచారాన్ని అందిస్తుందని... ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా అన్నింటిని తీర్చిదిద్దాలని స్పష్టంచేశారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్కడ పెద్దపెద్ద చెట్లతో పచ్చదనం ఫరిఢవిల్లేలా వేప, రావి, సిల్వర్ వోక్ వంటి ఏపుగా పెరిగే మొక్కలు నాటాలని సూచించారు. యాదాద్రి చేరువలో ఉన్న గండిచెరువును అద్బుతంగా లాండ్ స్కేపింగ్, నీటి ఫౌంటెన్లతో తీర్చిదిద్దాలని చెప్పారు.
ప్రశాంతత కలిగేలా...
బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు నిర్వహించేలా సుందరీకరణపనులు జరగాలని దిశానిర్దేశం చేశారు. యాదాద్రి ఆలయనగరిలో 250 దాతల కాటేజీలను అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని... ప్రతి 50 కాటేజీలకు ప్రత్యేక డిజైన్లతో భక్తప్రహ్లాద సహా అమ్మవార్ల పేర్లను పెట్టాలని తెలిపారు. కుటుంబంతో దర్శనానికి వచ్చే భక్తులకు ప్రశాంతత కలిగేలా, పుణ్యక్షేత్ర పునర్దర్శనంపై ఆసక్తి పెరిగేలా విశాలమైన పచ్చని స్థలాల్లో నిర్మాణాలు జరగాలని సూచించారు.
90 ఎకరాల్లో భక్తి ప్రాంగణం...
ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణ పురోగతిపై ఆరాతీసిన ముఖ్యమంత్రి... వీఐపీలతో పాటు సామాన్యులు బసచేసేందుకు వీలయ్యేలా పలురకాల కాటేజీలు నిర్మించాలని ఆదేశించారు. వేలమంది హాజరయ్యేలా కళ్యాణమండపాల నిర్మాణాలు ఉండాలని... ప్రాంగణంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, స్వాములతో ప్రవచనాలు కొనసాగించేందుకు లక్షలాది మంది కూర్చునేలా 90 ఎకరాల్లో భక్తి ప్రాంగణాన్ని నిర్మించాలని నిర్దేశించారు.
బంగారు తాపడం...
ఆలయ విమాన గోపురాన్ని బంగారుతాపడంతో తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి... రింగురోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక పుణ్యక్షేత్రాలస్థాయిలో యాదాద్రిని తీర్చిదిద్దుతున్నామన్న ఆయన... ప్రపంచవ్యాప్తంగా భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారని తెలిపారు.
రెండు మూడు నెలల్లో...
కరోనా పరిస్థితి నుంచి రాష్ట్రం కోలుకుంటోందని... ఆలయ నిర్మాణాలకు సంబంధించి ఆర్థిక వనరులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తున్నందున పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. మరో రెండు మూడు నెలల్లో యాదాద్రిని ప్రారంభించుకునే దిశగా ఆలయ అధికారులు కృషి చేయాలని సూచించారు.