పంచాయతీరాజ్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీల్లో పచ్చదనం, పరిశుభ్రతతోపాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి రూపొందించనున్న కార్యాచరణ ప్రణాళిక విధివిధానాలపై అధికారులతో చర్చించారు. నేడు మరోసారి సమీక్ష చేసి తుది నిర్ణయం ప్రకటిస్తామని సీఎం పేర్కొన్నారు. కార్యాచరణ ప్రణాళికలో ఏ ఏ అంశాలు ఉండాలో వాటిపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు.
ముందే నిధుల విడుదల
కార్యాచరణ ప్రణాళికపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి ప్రతి నెలా రూ. 339 కోట్లను గ్రామపంచాయతీలకు కార్యాచరణ పథకం అమలు ప్రారంభం కావడానికి ముందే విడుదల చేస్తునట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి నెల వచ్చే ఈ నిధులు మొత్తం 8 నెలల పాటు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు.
అక్టోబర్ 5 లేదా 6
కార్యాచరణ ప్రణాళిక అక్టోబర్ 5 లేదా 6 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ లోపల కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. కార్యాచరణ పకడ్బందీగా అమలు చేయడానికి సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీ తన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకుని దానికి గ్రామ సభ ఆమోదం పొందాలన్నారు.
ఆమోదం ఉండాల్సిందే
గ్రామంలో ఖర్చు పెట్టే ప్రతీ పైసా గ్రామ సభ ఆమోదంతోనే జరగాలని సీఎం స్పష్టం చేశారు. ఇవాళ జరగనున్న సమీక్షా సమావేశానికి కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. వారితో పాటు వారి జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీడివోలను, ఒక డీఎఫ్‌వోను, ఒక డీపీవోను, ఎస్ఈ విద్యుత్ శాఖ, సీపీవోను తమ వెంట తీసుకురావాలని సీఎం పాలనాధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి.. మంచి మనసున్న మలయాళ మెగాస్టార్