భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్
12:17 October 21
హైదరాబాద్లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్
హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిందని... నగరంలోని వరద నీటితో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చెరువుల ద్వారా కూడా చాలా నీరు నగరంలోని చెరువులకు చేరిందని కేసీఆర్ అన్నారు. నగరంలోని చెరువులన్నీ పూర్తిగా నిండాయని తెలిపారు. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
పరిస్థితిని పరిశీలించాలి
చెరువులన్నీ నిండడంతో పాటు ఇంకా వరద నీరు వస్తున్నందున గండి పండడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కేసీఆర్ అన్నారు. నగరంలోని అన్ని చెరువుల పరిస్థితి, కట్టల పరిస్థితిని పరిశీలించాలని... ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎక్కడైనా గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్న చోట, గండ్లు పడే అవకాశం ఉన్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలని... వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఇదీ చదవండి :ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన