కరోనా కట్టడికి అధికార యంత్రాంగం... దృఢ వైఖరితో పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. లాక్‌డౌన్, రాత్రి పూట కర్ఫ్యూని కఠినంగా అమలు చేయాలని.. జనం దూరం పాటింటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కట్టడిని కొనసాగిస్తూనే వైరస్ నివారణ చర్యల్లో భాగంగా... రాష్ట్రంలోని ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో మరిన్ని సౌకర్యాలతోపాటు అదనంగా పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు.
వైద్య సేవల కోసం 8 కొత్త కేంద్రాలు..
కరోనా నివారణ చర్యలపై మంగళవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్... ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా బాధితులకు సత్వర వైద్య సేవల కోసం వెంటనే 8 కొత్త కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. వాటిలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన ఐసోలేషన్ వార్డులు... క్వారంటైన్ కేంద్రాలకు అవసరమైన వనరులు సమకూర్చాలన్నారు. ఎక్కడా సమస్యలు రాకుండా... చూడాలని చెప్పారు. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిని ఇంటికి పంపించినా.. పర్యవేక్షణ కొనసాగాలని సూచించారు.