రాష్ట్ర ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేక సందేశం ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపదే లేదని... కరోనా మరోసారి రుజువు చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్తున్నామని వాపోయారు. ఇలాంటి దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలమని కేసీఆర్ అన్నారు.
ఆరోగ్య సంపదను మించిన సంపద లేదన్న భావనతో తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కార్యాచరణ చేపట్టిందని సీఎం చెప్పారు. నాసిరకం ప్లాస్టిక్ వాడకం మీద నియంత్రణ విధించిన ప్రభుత్వం... గ్రీన్ కవర్ పెంచే హరితహరం వంటి పథకాలను పటిష్ఠంగా అమలు చేస్తోందన్నారు. గ్రామీణ, పట్టణాభివృద్దికోసం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు పర్యావరణాన్ని పెంచేందుకు దోహదం చేస్తున్నామని, జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.