గ్రేటర్ ఎన్నికలు అత్యంత కీలకమైనవని.. వంద శాతం విజయమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. సంక్షేమ పథకాలు-అభివృద్ధి కార్యక్రమాలే వారికి కొండంత బలమని.. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలపై 17 మంది మంత్రులు, 18 మంది పార్టీ ప్రధాన కార్యదర్శులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. సుమారు ఏడు గంటల పాటు సుధీర్ఘంగా పలు అంశాలపై చర్చించారు.
జీహెచ్ఎంసీ తెలంగాణ గుండెకాయ: కేసీఆర్
జీహెచ్ఎంసీ తెలంగాణ గుండెకాయ అని.. తెరాస ప్రభుత్వం ఆరున్నర ఏళ్లలో దేశాల్లోని మెట్రో నగరాలకు తలమానికంగా తీర్చిదిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రపంచస్థాయి నివాసయోగ్యంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందన్నారు. విద్యుత్, తాగునీటి, మౌలిక వసతుల్లో ఏ సమస్యలు లేవన్నారు. మెట్రో రైలు నగరానికి నగీషీలా ఉందని అభివర్ణించారు. తెరాస పాలనలో శాంతిభధ్రతలు పటిష్టంగా చేపడుతున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ సహా అన్ని నగరాలు పట్టణాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపట్టామన్నారు. కొత్త పురపాలక చట్టం ద్వారా నగరాలు పట్టణాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. 374 బస్తీ దవాఖానాలతో ప్రజలు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్లు, ప్లైఓవర్లు, అండర్ పాసింగ్లతో సహా రవాణా వసతులు మెరుగు పరుస్తున్నామని తెలిపారు. వరదల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు రూ.500ల కోట్లు విడుదల చేశామన్నారు. ఏ కష్టం వచ్చినా.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న భావన ప్రజల్లో ఉందన్నారు.
దుబ్బాకలో ఓడిపోతామనుకోలేదు..
హైదరాబాద్‌లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు. భాజాపాను పట్టించుకోరని.. జీహెచ్ఎంసీలో ప్రజలంతా తమవైపే ఉన్నారని.. తెరాసకు ప్రజలు పట్టం కడుతారని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలవి ఊకదంపుడు మాటలే అని కొట్టిపడేశారు. వాటిని ప్రజలు తిరస్కరిస్తారన్నారు. కాంగ్రెస్‌కు ఉనికే లేదని.. గ్రేటర్లో భాజపా ఆటలు సాగవన్నారు. ఆ పార్టీ ప్రజల్లో లేదని.. మనం పట్టించుకోవద్దన్నారు. దుబ్బాకలో ఓడిపోతామనుకోలేదని తెలిపారు. కచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో కొంత ఏమరపాటు వల్ల ఆశించిన ఫలితం రాలేదన్నారు.
గ్రేటర్ ఎన్నికల ఇంఛార్జ్‌గా కేటీఆర్..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కడా ఏమరపాటు ఉండొద్దని.. పోలింగ్ ముగిసే వరకు అందరూ కష్టపడి విజయమే లక్ష్యంగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. విపక్షాల అబద్ధాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేదిలేదని స్పష్టం చేశారు. మంత్రులు సహా ముఖ్యులను డివిజన్‌కు ఓ ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో పూర్తిగా సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ విబేధాలు ఎక్కడా కన్పించొద్దన్నారు. కచ్చితంగా గెలిచేవారికే టిక్కెట్లు ఉంటాయని తేల్చి చెప్పారు. అసంతృప్తి, అసమ్మతి బెడద ఉండరాదన్నారు. ఎన్నికల్లో పార్టీకోసం శ్రమించే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల ఇంఛార్జ్‌గా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను నియమిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్ కార్పొరేషన్‌ను నిలబెట్టుకుంటామని తెలిపారు. ఖమ్మంలోనూ గెలిచేందుకు సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
పరస్పర సహకారంతో పనిచేయాలి..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరస్పర సహకారంతో పనిచేయాలని తెరాస, మజ్లీస్ పార్టీలు నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆపార్టీ నేతలు ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఎన్నికలు, వ్యూహాలు, సీట్లు, సర్దుబాట్లపై సుధీర్ఘంగా చర్చించారు. గతంలో మాదిరిగానే బహిరంగంగా ఎలాంటి పొత్తు లేకపోయినా అవగాహనతో పనిచేయాలని.. విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వద్దనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మంత్రి మండలి సమావేశంలో మైనార్టీలకు సంబంధించిన పలు అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:బాణసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం