సీఎం కేసీఆర్ గల్ఫ్ పర్యటనకు రంగం సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి గల్ఫ్ వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉపాధి అవకాశాల కోసం అక్కడికి వెళ్లిన రాష్ట్ర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారి కోసం ప్రభుత్వం తరపున అవసరమైన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. గల్ఫ్‌కు వెళ్లే వారి ప్రాంత శాసనసభ్యులతో కలిసి తానే స్వయంగా అక్కడకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటానని చెప్పారు.
బడ్జెట్ సమావేశాల అనంతరం..
బడ్జెట్ సమావేశాల తర్వాత సౌదీ, ఖతర్, దుబాయ్, కువైట్, జెడ్డాలో సీఎం పర్యటించే అవకాశం ఉంది. ఆయా దేశాల్లోని పలు నగరాలు, ప్రాంతాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి... ప్రవాసుల పరిస్థితులను తెలుసుకుంటారు. అక్కడి ప్రభుత్వాధినేతలు, అధికారులను కూడా కలవనున్నారు. సౌదీరాజును కూడా కలిసే అవకాశం ఉంది. అక్కడి పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమై టీఎస్ ఐపాస్‌తో పాటు రాష్ట్రంలోని అవకాశాలు వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.
ఏజెంట్ల మోసం.. వీసా గడవుపై..
ఉపాధి కోసం అక్కడకు వెళ్లిన వారితో సమావేశం కానున్న ముఖ్యమంత్రి... అక్కడ ఇబ్బందుల్లో ఉన్న వారిని రాష్ట్రానికి తిరిగి రావాలనే పిలుపునిస్తారని అంటున్నారు. ఏజెంట్ల వల్ల మోసపోయి తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్న వారి గురించి, వీసా గడువు ముగిసి జైళ్లలో ఉన్న వారి విషయమై అక్కడి అధికారులతో చర్చిస్తారని చెబుతున్నారు. వారిని ప్రభుత్వ ఖర్చుతో స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు హామీ ఇస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.