ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలెఅన్న కాళోజీ మాతృభాష స్ఫూర్తి అద్భుతమని సీఎం కేసీఆర్ కొనియాడారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని గురువారం పురస్కరించుకుని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ తెలుగు భాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.
CM KCR: కాళోజీ స్ఫూర్తి.. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచి: కేసీఆర్ - కాళోజీ నారాయణరావు జయంతి
కాళోజీ నారాయణరావు మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని ప్రశంసించారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా పెంచేందుకు తెలంగాణ సాహితీ వేత్తలు కృషి చేయాలని సీఎం కోరారు. "పుట్టుక నీది చావు నీది.. బతుకంతా దేశానిది" అని నినదించిన కాళోజీ జీవితమంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ భాషా, సాహిత్య రంగాల్లో కృషి చేస్తున్న కవులు, రచయితలను గుర్తించి వారికి ఆయన పేరిట పురస్కారం అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటోందని కేసీఆర్ తెలిపారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కాళోజీ పురస్కారాన్ని ఈ ఏడాది అందుకుంటున్న ప్రముఖ కవి, రచయిత పెన్నా శివరామకృష్ణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.