CM KCR fires on Central Govt : రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు కేంద్రం పాల్పడుతోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రగతిశీల రాష్ట్రంపై కేంద్ర వైఖరి చాలా బాధాకరమన్నారు. కేంద్రం అనేక విషయాల్లో రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు.
'రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బధిర శంఖారావంగా మారడం విషాదకరం. రాష్ట్ర వడ్లు కొనాలని నాతో సహా అందరూ దిల్లీలో ధర్నా చేశాం. నూకలు తినాలన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు బాధించాయి. రైతులతో చెలగాటం ఆడే ధోరణి వీడాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరుగుతోంది. బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాల సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నారు. కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలు తెలంగాణకు గుదిబండగా మారాయి. మీటర్ల విషయంలో రైతులపై భారం వేసేందుకు మేం సిద్ధంగా లేం. అన్నిరకాల వనరులున్న మనదేశం ఇంకా ఎందుకిలా ఉంది?' -- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి