cm kcr comments in praja deevena sabha: ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో కేసీఆర్ మాట్లాడారు. ''నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోంది. మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చింది. మరో ఏడాది ఆగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని చెప్పాం. తెరాసకు మద్దతు ప్రకటించిన సీపీఐకి కృతజ్ఞతలు. మునుగోడు నుంచి దిల్లీ వరకు ఐక్యత కొనసాగాలి.
అమిత్ షా సమాధానం చెప్పాలి..: విభజన చట్టం ప్రకారం రావాల్సినవి ఏవీ మనకు రాలేదు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే.. 8 ఏళ్లుగా తేల్చటం లేదు. కృష్ణా జలాల్లో మీకు వాటా ఇచ్చేది లేదని చెప్పేందుకు అమిత్ షా వస్తున్నారా. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు, సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం. కృష్ణా జలాల్లో వాటా గురించి భాజపా నేతలు మోదీ, అమిత్ షాను ఎప్పుడైనా అడిగారా. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి రేపు మునుగోడులో చెప్పాలని అమిత్‌షాను అడుగుతున్నా.
నో మ్యాన్ జోన్ నుంచి జీరో ఫ్లోరైడ్ జిల్లాగా..: మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్‌తో ఎంత బాధ పడిందో తెలుసు. ఫ్లోరైడ్ బాధితుడిని దిల్లీకి తీసుకెళ్లి చూపించినా.. మన మొర ఎవరూ వినలేదు. గతంలోని ఏ పాలకుడు మునుగోడు ఫ్లోరైడ్ కష్టాలను తీర్చలేదు. 15 రోజులు జిల్లాలో తిరిగి ఫ్లోరైడ్ కష్టాలపై అవగాహన కల్పించాం. అందరి పోరాట ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు మిషన్ భగీరథ జలాల ద్వారా జీరో ఫ్లోరైడ్ జిల్లాగా మారాం. నల్గొండ జిల్లా నో మ్యాన్ జోన్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. మేధావులు హెచ్చరించినా.. ఫ్లోరైడ్ గురించి గత పాలకులు ఆలోచించలేదు. నల్గొండ జిల్లాలో కృష్ణా నది పారుతున్నా.. ప్రజలకు తాగునీళ్లు అందలేదు.
భాజపాకు ఓటేస్తే బావి కాడ మీటర్ వచ్చినట్లే..: రైతులకు అనవసరంగా డబ్బులు పంచిపెడుతున్నామని భాజపా నేతలు నిలదీశారు. రైతుబంధు, పింఛన్లు ఎందుకు ఇస్తున్నారని మమ్మల్ని నిలదీశారు. రైతుబంధు, రైతు బీమాలాంటి పథకాలు బంద్ పెట్టాలని అంటున్నారు. మీటర్లు పెట్టమనే భాజపా కావాలా, మీటర్లు వద్దనే తెరాస కావాలా. మునుగోడులో భాజపాను గెలిపిస్తే రేపు మోటార్లకు మీటర్లు పెడతారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనని భాజపాతో నేను పోరాడుతున్నా. మునుగోడులో భాజపాకు ఎప్పుడూ డిపాజిట్లు రాలేదు. ఈసారి భాజపాకు ఓటు పడిందంటే.. బాయి మోటార్లకు మీటర్లు పడతాయి. భాజపాకు ఓటు వేస్తే బాయి వద్ద మీటరు వచ్చినట్టే. ప్రజల బలం చూసుకునే.. నేను మీటర్లు పెట్టనని కేంద్రంతో పోరాడుతున్నా- కేసీఆర్, ముఖ్యమంత్రి