CM KCR on Early Polls: రాష్ట్రంలో ఈసారి ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో అవసరం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లామని పేర్కొన్నారు. గతంలో తెరాస పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, అమలు చేయాల్సిన పథకాలు ఉన్నందునే.. అసెంబ్లీని రద్దు చేయాల్సివచ్చిందన్నారు. ఈ సారి ఆ అవసరం లేదని.. అన్ని ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కచ్చితంగా తెరాస ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. రానున్న ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో సీట్లు దక్కించుకుంటామని స్పష్టం చేశారు.
నివేదికలో స్పష్టం
వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 శాసనసభ స్థానాలు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయని.. 30 స్థానాలకు గాను 29 స్థానాల్లో తెరాస గెలుస్తుందని నివేదిక వెల్లడించిందని చెప్పారు. 0.3 శాతం తేడాతో ఒక స్థానం కోల్పోతున్నట్లు నివేదిక వచ్చిందని పేర్కొన్నారు. నివేదిక మేరకు 119 స్థానాలకు గాను 4 స్థానాలు కోల్పోతామని తెలుస్తోందన్నారు. మరో 25 రోజుల్లో నివేదిక బహిర్గతం చేస్తామని ప్రకటించారు.