ఏపీ వ్యాప్తంగా ‘జగనన్న పచ్చతోరణం - వనమహోత్సవం 2021’ కార్యక్రమం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో సీఎం జగన్ మొక్క నాటి వనమహోత్సవం-2021 కార్యక్రమాన్ని ప్రారంభించారు. రావి, వేప మొక్కలను కలిపి ముఖ్యమంత్రి జగన్ నాటారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. చెట్లను పరిరక్షించాలని కోరుతూ సీఎం ప్రతిజ్ఞ చేయించారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటేందుకు వనమహోత్సవం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది.
'రాష్ట్రంలో చెట్ల పెంపకాన్ని ఓ యజ్ఞంగా చేపట్టాలి. చెట్ల వల్ల జరిగే మంచిని అందరూ గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో ప్రస్తుతం 23 శాతం అడవులు ఉన్నాయి. అడవులను 33 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. అడవుల విస్తీర్ణం పెంచేందుకు అందరూ నడుంబిగించాలి. చెట్ల పెంపకం వల్లే పర్యావరణం పరిరక్షణ సాధ్యం. రాష్ట్రంలో 5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటున్నా.'
- సీఎం జగన్