న్యాయవ్యవస్థ పనితీరుపై అవగాహన లేకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి న్యాయమూర్తులపై కట్టుకథలు అల్లుతూ రాసిన లేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.మోహనకృష్ణన్ కోరారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ స్పర్థలు, వ్యక్తిగత ద్వేషాలను చల్లార్చుకోవడానికే జగన్ లేఖ రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, అది ఆయన రాజకీయ అనుభవ రాహిత్యానికి అద్దం పడుతోందని విమర్శించారు. న్యాయవ్యవస్థపై నిందలు వేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకొనే ఇలాంటి కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని, కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో వ్యవస్థపై ఇలాంటి కట్టుకథలు ప్రచారం చేయకుండా ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.
‘భారత న్యాయవ్యవస్థపై దారుణమైన ప్రభావం చూపేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రాసిన లేఖను ఖండిస్తూ తీవ్రమైన ఆవేదనతో నేనీ లేఖ రాస్తున్నా. జగన్ విడుదల చేసిన లేఖ భారత న్యాయచరిత్రలో ఒక దారుణమైన పరిస్థితిని కల్పించింది. న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పెకిలించడమే ఆ లేఖ లక్ష్యం. జగన్ జస్టిస్ ఎన్‌వీరమణ, ఇతర న్యాయమూర్తులపై తప్పుడు ఆరోపణలు చేశారు. కిందిస్థాయి న్యాయస్థానాల్లో జోక్యం చేసుకుంటున్నారని అబద్ధాలు, కట్టుకథలు ప్రచారం చేస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించారు. జగన్‌కు సొంత రాష్ట్రంలో పలువురు ప్రముఖులతో ఉన్న వ్యక్తిగత ప్రతీకారం నుంచే ఆ లేఖ పుట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను అవమానించేలా, పరువు నష్టం కలిగించేలా రాసిన లేఖలో సాక్ష్యాధారాలు లేవు. పైగా ఆ లేఖ ఈ సమయంలో ఎందుకు విడుదల చేశారో అందరికీ తెలుసు. ఆ లేఖలో ముఖ్యమంత్రి రాజకీయ ఎజెండా తప్ప ఇంకోటి లేదు. ఇలాంటి పెడపోకడలను ఉపేక్షిస్తే ప్రతి రాజకీయ నాయకుడు, కార్యనిర్వహణాధికారి న్యాయవ్యవస్థను బెదిరించగలుగుతారు. అందువల్ల ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి’ అని మోహనకృష్ణన్ లేఖలో పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థపై బురదజల్లడమే
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి లేఖ రాయడాన్ని ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ ఖండించింది. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ప్రధాన కార్యదర్శి అజయ్ నథానీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జికి వ్యతిరేకంగా లేఖ రాయడంతోపాటు, మీడియాలో ఆరోపణలు చేయడం ఉన్నత పదవుల్లో ఉన్నవారు చేయాల్సిన పనికాదు. న్యాయవ్యవస్థపై బురదజల్లేందుకు రాజకీయ నేతలు చేసే ఇలాంటి పనులను ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది’ అని తీర్మానించారు.
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, అప్పిలేట్ టైబ్యునల్ బార్ అసోసియేషన్ ఖండన