రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల్లో ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని... అత్యంత ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు చేయాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తక్షణం చెల్లింపులు చేయడానికి వీలుగా..
ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు నిధుల కొరత లేకుండా 20 వేల కోట్ల రూపాయల నిధులను సీఎం కేసీఆర్ పౌరసరఫరాల సంస్థకు సమకూర్చారని తెలిపారు. రైతులకు తక్షణం చెల్లింపులు చేయడానికి వీలుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల వివరాలను త్వరితగతిన ఆన్‌లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్)లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దళారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా ఆన్‌లైన్ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని చెప్పారు. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి కనీస మద్దతు ధర చెల్లింపుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.