ఆంధ్రప్రదేశ్లోని అమరావతి అసైన్డ్ భూముల అంశంలో మాజీమంత్రి నారాయణను నిందితుడిగా చేర్చిన సీఐడీ... బుధవారం ఆయన నివాసాలు, కశాశాలల్లో సోదాలు నిర్వహించింది. నిన్న ఉదయం 11 గంటలకు నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని నారాయణ నివాసానికి రెండు బృందాలుగా వెళ్లిన 8 మంది అధికారులు... దాదాపు 7 గంటలపాటు సోదాలు చేశారు. ఇంటి బయట ఉన్న సామాన్య ప్రజలతో పాటు నారాయణ ఆసుపత్రి సిబ్బందిని ఇంట్లోకి తీసుకెళ్లి ప్రశ్నించారు. ఆ సమయంలో వారి సెల్ ఫోన్లు, వాహనాల తాళాలు తీసుకున్నారు.
నారాయణ ఇంట్లో పనిచేసే మహిళను గంటకు పైగా విచారించారు. తాను చదువుకోలేదని, పని చేసుకుని వెళ్లడం తప్ప ఏ విషయాలూ తెలియవని ఆమె చెప్పినట్లు సమాచారం. హరినాథపురంలోని నారాయణ జూనియర్ కళాశాల సిబ్బందిని అదికారులు ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటల వరకు ఎవర్నీ బయటకి పోనివ్వకుండా, ఇతరుల్ని లోనికి రానివ్వకుండా సోదాలు సాగించారు. పని పూర్తయ్యాక అధికారులు ఆటోల్లో వెళ్లిపోయారు. వివరాలు అడిగేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా స్పందించలేదు. హైదరాబాద్‌లోని నారాయణ నివాసం, విజయవాడలోని పలు ప్రాంతాల్లోనూ సీఐడీ సోదాలు చేసినట్లు సమాచారం.
అంతకుముందు హైదరాబాద్‌లో నారాయణ భార్యకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మొదట మాదాపూర్‌లోని కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో... కేపీహెచ్బీ కాలనీ నివాసానికి వెళ్లారు. అక్కడా నారాయణ లేకపోడంతో... ఆయన భార్య రమాదేవికి నోటీసు అందించారు. ఈ నెల 22న ఉదయం 11 గంటకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించారు. లేదంటే అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు.