Christmas Celebrations 2023 at LB Stadium Today 2023 : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
Traffic Diversions in Hyderabad Today : ఏఆర్ పెట్రోల్ బంక్ కూడలి నుంచి బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం కూడలి వైపు వెళ్లవలసిన వాహనాలను నాంపల్లి లేదా రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రిల వైపు నుంచి వచ్చే వాహనదారులకు బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం కూడలి వైపు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. గన్‌ఫౌండ్రిలోని ఎస్బీఐ నుంచి సుజాత స్కూల్, చాపెల్ రోడ్డు వైపు పంపించనున్నట్లు పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ నుంచి బషీర్‌బాగ్ కూడలి వైపు వచ్చే వాహనాలు లిబర్టీ జంక్షన్ నుంచి అవసరాన్ని బట్టి హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణలతో చర్చిలను సుందరంగా ముస్తాబు చేశారు. పండుగ సందర్భంగా మెదక్‌లో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మత గురువులతో కలిసి గురువారం నిరుపేద క్రైస్తవులకు బహుమతులు పంపిణీ చేశారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి కానుకలు అందజేశారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఏసు క్రీస్తు ఊరేగింపు ఘనంగా జరిపారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని బొగ్గులకుంటలో సెమీ క్రిస్మస్ వేడుకలు వైభవంగా సాగాయి. అనాథ పిల్లలకు బహుమతులు అందజేశారు. యేసు క్రీస్తు జన్మ కథను జీవితంలోకి తెచ్చే నాటకంతో పాటు, చిన్నారుల ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.