CM KCR Review on State Budget: వచ్చే ఆర్థిక సంవత్సరానికి.. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులతో.. ప్రగతిభవన్‌లో సీఎం సమావేశం నిర్వహించారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో.. బడ్జెట్ కోసం ఆర్థికశాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. వాటిపై శాఖల వారీగా సమావేశాలు నిర్వహించింది.
రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - CM KCR review on Telangana budget
15:30 January 21
రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు రెండు రోజులుగా అధికారులతో సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు.. ఆర్థికశాఖ కసరత్తు సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ ఈరోజు సమీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ, వ్యయాలతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు కేటాయింపులు, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సాగునీటి ప్రాజెక్టులకే పెద్దపీట వేయనుంది. ఈ మేరకు వచ్చే బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అగ్ర తాంబూలం ఇవ్వనుంది. దీని కోసం సుమారు రూ.37,000 కోట్లు కేటాయించినట్టు సమాచారం. అందులో రూ.16,000 కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు వినియోగించనున్నారు. ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ కొలిక్కివచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా, నిధులు కేటాయించడంతోపాటు కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ తిరిగి చెల్లించేందుకు అవసరమైన నిధులనూ బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
ఇవీ చదవండి:సికింద్రాబాద్ ఘటన.. భవనం మొదటి అంతస్తులో ఒక మృతదేహం గుర్తింపు
'ఆ దాడి అంతా డ్రామా.. నిందితుడు ఆప్ కార్యకర్తే'.. భాజపా ఆరోపణ.. స్వాతి ఫైర్!