Chandrababu Fires on YCP Government : ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీలో వ్యవస్థలన్నీ నాశనమైపోయాయని మండిపడ్డారు. ప్రజా జీవనం అంధకారంలో ఉందని విమర్శించారు. వ్యవస్థలను నాశనం చేయడమే వైసీపీ అజెండా అని దుయ్యబట్టారు. ఏపీలో జీవో నంబర్ 1 ద్వారా ఉన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. కుప్పం వెళ్తే గొడవలు సృష్టించి తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం: ఈ సందర్భంగా వైసీపీ కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు ఘటనలని చంద్రబాబు ఆరోపించారు. కందుకూరు ఘటన పోలీసుల కుట్ర కాదని చెప్పే ధైర్యం ఉందా అని నిలదీశారు. శాంతి భద్రతలు కాపాడే బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. కుట్ర, కుతంత్ర రాజకీయాలను తిప్పికొడతామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పట్టాలెక్కిస్తామని స్పష్టం చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే తమ ఆఫీసుపై దాడులు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు.
సైకో చెప్పినట్లు చేస్తారా:అమరావతి రైతులకు సంఘీభావం కోసం వెళ్తే రాళ్లు, కర్రలతో దాడులు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటంలో సమావేశానికి ప్రజలే స్థలం ఇచ్చారని తెలిపారు. స్థలం ఇచ్చిన ప్రజల ఇళ్లు కూల్చే చర్యలు చేపట్టారని ఆరోపించారు. విజయ్‌భాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి కంటే జగన్ గొప్పవారా అని ప్రశ్నించారు. సైకో చెప్పినట్లు చేస్తారా అని పోలీసులను నిలదీశారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చంద్రబాబు చెప్పారు.
ఏపీలో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు: అరాచకాలను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని వివరించారు. విశాఖ వెళ్లిన పవన్‌ను బయటకు రాకుండా ఆంక్షలు పెట్టారని ధ్వజమెత్తారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పవన్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
"ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి. వైసీపీకి మాత్రం నేరాలు, అవినీతి, వ్యవస్థలు నాశనం చేయడం అలవాటు. బ్రిటిష్‌కాలం నాటి జీవో తీసుకొచ్చారు. దానికి చట్టబద్ధత ఉందో లేదో కూడా తెలియదు. నా నియోజకవర్గానికి వెళితే అడ్డుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని. సొంత నియోజకవర్గానికి రానీయకుండా చేసేందుకు 2-3 వేల మంది పోలీసులను పెట్టి వెనక్కి పంపేందుకు యత్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో నంబర్ 1 కరెక్ట్ కాదు." - చంద్రబాబు, టీడీపీ అధినేత
ఇవీ చదవండి:చంద్రబాబుతో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ.. ఆ అంశాలపై చర్చ..
'మిగతా వారిలా పాదయాత్రలో సెలవులు తీసుకోను.. ఇంటికి వెళ్లను'.. రాహుల్‌పై PK వ్యాఖ్యలు!