Polavaram Project Dispute : పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ప్రభావంపై బుధవారం దిల్లీలో కేంద్ర జలసంఘం సాంకేతిక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరోమారు రాష్ట్రంలో ముంపు ప్రభావంపై గట్టి వాదనలను వినిపించేందుకు తెలంగాణ సిద్ధమైంది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల 891 ఎకరాల భూమితో పాటు ఆరు గ్రామాలు మునుగుతాయని పేర్కొంది.
Polavaram Project Back Water Dispute :పోలవరం వల్ల ముంపుపై తెలంగాణ లేవనెత్తిన అంశాలను ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర జలసంఘం తిరస్కరిస్తున్న నేపథ్యంలో 10 అంశాలతో కూడిన లేఖను మ్యాప్‌లు, ఇతర ఆధారాలతో సహా పంపినట్లు సంబంధితవర్గాల ద్వారా తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నేతృత్వంలో తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల అభిప్రాయాలను సీడబ్ల్యూసీ నమోదు చేస్తోంది. సమావేశానికి తెలంగాణ నుంచి ఈఎన్‌సీ మురళీధర్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ జలసౌధలో ప్రాజెక్టు ముంపుపై ఇంజినీర్లు కసరత్తు చేశారు.
అభ్యంతరాలివీ.. మణుగూరు భారజల కర్మాగారం పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో పోల్చితే ఎక్కువ ఎత్తులో ఉందని, ఇది 64 నుంచి 85 మీటర్ల మట్టంలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. మరోవైపు కర్మాగారం జనరల్ మేనేజర్ 2019లో రాసిన లేఖ ప్రకారం క్రిటికల్ ఆపరేషన్ లెవల్ 60 మీటర్లుగా ఉంది. నీటిపారుదలశాఖ అధ్యయనం ప్రకారం 58 నుంచి 63 మీటర్లు ఉంది.